HUL Price hike: హెచ్‌యూఎల్‌ పెంచేసింది.. బ్రిటానియా రెడీ అంటోంది!

వినియోగదారుల ఉత్పత్తులను తయారు చేసే హిందుస్థాన్‌ యూనీలీవర్‌ (HUL) కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచింది.

Published : 31 Mar 2022 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల ఉత్పత్తులను తయారు చేసే హిందుస్థాన్‌ యూనీలీవర్‌ (HUL) కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచింది. ముడి సరకు ధరలు పెరగడం, భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి ధరలను 3-5 శాతం మేర పెంచింది. దీంతో సర్ఫెక్సల్‌, వీల్‌, రిన్‌ వంటి డిటర్జెంట్‌ పౌడర్లతో పాటు డోవ్‌, లక్స్‌, పేర్స్‌, హమామ్‌, లిరిల్‌, రెక్సోనా వంటి సబ్బుల ధరలు కూడా పెరగబోతున్నాయి.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సన్‌ ఫ్లవర్‌, పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతులపై ప్రభావం పడింది. ముఖ్యంగా సబ్బుల తయారీ కంపెనీలన్నీ దాదాపు  పామాయిల్‌ను తమ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో సర్ఫెక్సల్‌ డిటర్జెంట్‌ కేజీ ₹130 నుంచి ₹134కు పెరిగింది. లక్స్‌ సోప్‌ (100గ్రాములు× 4) ఏకంగా 6.66 శాతం పెరిగి ₹160కి చేరింది. పియర్స్‌ (75 గ్రాములు×3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి ₹135కి చేరింది. కొన్ని వారాల క్రితమే సబ్బులు, డిష్‌వాష్‌ ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్‌యూఎల్‌.. ఇటీవలే బ్రూ కాఫీ, టీ పొడి ధరలనూ సవరించింది. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే ఇతర కంపెనీలు సైతం ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

ధరల పెంపునకు బ్రిటానియా సిద్ధం

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ సైతం ధరల పెంచనున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడుల కారణంగా 7 శాతం మేర ధరలను సవరించే అవకాశం ఉందని సంకేతం ఇచ్చింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 3 శాతం ఉంటుందని తొలుత తాము అంచనా వేశామని, పుతిన్‌ చర్య కారణంగా అది 8-9 శాతనికి చేరిందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరున్‌ బెర్రీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉత్పత్తుల తయారీలో వినియోగించే ప్రతి ముడిసరకూ ధర పెరిగిందని, దీంతో ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుడ్‌ డే, మ్యారీ గోల్డ్‌ బిస్కెట్లను బ్రిటానియా తయారుచేస్తోంది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు పార్లే, డాబర్‌ సైతం ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని