Hurun Global Rich List: అదానీ సంపదలో వారానికి రూ.3,000 కోట్లు ఆవిరి!

Hurun Global Rich List: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను హురున్‌ రిచ్‌ లిస్ట్‌ విడుదల చేసింది. అత్యధిక మంది బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.

Updated : 22 Mar 2023 19:13 IST

Hurun Global Rich List | దిల్లీ: అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద ఈ ఏడాది భారీగా కుంగినట్లు ‘ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ (Hurun Global Rich List Report)’ నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన సగటున వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయినట్లు పేర్కొంది. ఫలితంగా ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. రష్యాకు చెందిన ఝోంగ్‌ శాన్‌శాన్‌ ఆ స్థానానికి చేరారు. ప్రస్తుతం అదానీ సంపద 53 బిలియన్‌ డాలర్లుగా హురున్‌ నివేదిక లెక్కగట్టింది.

విమానాశ్రయాల నుంచి వంట నూనెల వరకు వివిధ రంగాలకు విస్తరించిన అదానీ గ్రూప్‌ (Adani Group).. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల తర్వాత తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గ్రూప్‌నకు చెందిన నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి చేరిన గౌతమ్‌ అదానీ ఇప్పుడు టాప్‌-20లో కూడా లేకపోవడం గమనార్హం. గరిష్ఠ స్థాయిల నుంచి ఆయన సంపద 60 శాతానికి పైగా తగ్గింది.
(ఇదీ చదవండి: దేశంలో మరిన్ని ఎయిర్‌పోర్టులనూ నిర్వహిస్తాం: అదానీ ఎయిర్‌పోర్ట్స్‌)

హిండెన్‌బర్గ్‌ నివేదిక జనవరి 24న విడుదలైంది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ (Adani Group)లోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.7.11 లక్షల కోట్లు ఆవిరైంది. కీలక సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ జనవరి 24న రూ.3,443 వద్ద ఉండేది. తర్వాత అది ఓ దశలో దాదాపు రూ.900 స్థాయికి పడిపోయింది. తర్వాత కొంత వరకు పుంజుకుంది. ప్రస్తుతం అది రూ.1,812 వద్ద ట్రేడవుతోంది.

అంబానీ పరిస్థితి ఇదీ..

మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద సైతం ఈ ఏడాది తగ్గినట్లు హురున్‌ నివేదిక (Hurun Global Rich List Report) తెలిపింది. ఆయన సంపద దాదాపు 20 శాతం కుంగి 82 బిలియన్‌ డాలర్లకు చేరింది. అయితే, వరుసగా మూడో ఏడాది ఆయన ఆసియా కుబేరుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇటీవలే రిలయన్స్‌ షేరు రూ.2,180 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ఈ కేలండర్‌ సంవత్సరంలోనే ఈ స్టాక్‌ 11 శాతం పతనం కావడం గమనార్హం. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ ఐదు శాతం నష్టపోయింది. స్టాక్‌ మార్కెట్లలో వచ్చిన దిద్దుబాటు వల్లే రిలయన్స్‌ షేరు కుదేలైనట్లు నిపుణులు చెప్పారు.

కేవలం భారత బిలియనీర్లదే కాదు..

ప్రపంచవ్యాప్తంగానూ ధనవంతుల సంపద ఈ ఆర్థిక సంవత్సరం కరిగింది. ప్రపంచం మొత్తంలో గత ఏడాది 3,384 మంది బిలియనీర్లు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 3,112కు తగ్గింది. అయితే స్టాక్‌ మార్కెట్‌ తిరిగి పుంజుకుంటే కుబేరుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని హురున్‌ (Hurun Global Rich List Report) తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ బలపడడం వంటి అంశాలు బిలియనీర్ల సంపదను హరించాయని హురున్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 70 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయినట్లు హురున్‌ నివేదిక వెల్లడించింది. తర్వాత ఎలాన్ మస్క్‌ 48 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. 

భారత్‌కు మూడో స్థానం..

అత్యధిక మంది బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో చైనా, అమెరికా ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బిలియనీర్లలో 53 శాతం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారని హురున్‌ నివేదిక (Hurun Global Rich List Report) తెలిపింది. ఈ జాబితాలో 187 మంది బిలియనీర్లతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే 28 మంది తగ్గారు. తర్వాత యూకే 144 బిలియనీర్లతో నాలుగో స్థానంలో ఉంది. హురున్‌ రిచ్‌ లిస్ట్‌లో భారతీయులు అత్యంత వేగంగా తమ స్థానాన్ని మెరుగుపర్చుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. గత పదేళ్ల వ్యవధిలో గౌతమ్‌ అదానీ 437 స్థానాలు ఎగబాకినట్లు తెలిపింది. గత ఏడాది కాలంలో 1 బిలియన్‌ డాలర్ల కంటే అధిక సంపదను జత చేసుకున్నవారి సంఖ్య పరంగా భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది.

భారత్‌లో 16 మంది కొత్త బిలియనీర్లు..

హురున్ గ్లోబల్ రిచ్‌ లిస్ట్‌లో కొత్తగా 176 మంది స్థానం సంపాదించారు. వీరిలో 16 మంది భారత్‌కు చెందినవారు. ప్రముఖ మదుపరి దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా తొలిసారి ఈ జాబితాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని