Hyundai Verna: హ్యుందాయ్‌ వెర్నా సరికొత్తగా.. ధర రూ.10.89 లక్షలు

Hyundai Verna: హ్యుందాయ్‌ వెర్నాలో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Published : 21 Mar 2023 19:27 IST

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ ప్రముఖ మోడల్‌ వెర్నా (Hyundai Verna)లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.10.89 లక్షల నుంచి రూ.17.37 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. హోండా సిటీ, స్కోడా స్లేవియా, ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌, మారుతీ సుజుకీ సియాజ్‌ వంటి వాటితో ఈ కొత్త వెర్నా పోటీ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

1.5 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో వస్తోన్న వెర్నా (Hyundai Verna) వేరియంట్ల ధర రూ.10.89 లక్షల నుంచి 16.19 లక్షల మధ్య ఉంది. అదే 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.14.83 లక్షల నుంచి రూ.17.37 లక్షలుగా హ్యుందాయ్‌ నిర్ణయించింది. ఈ కారు 18.6 నుంచి 20.6 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని పేర్కొంది. వెర్నాను తొలిసారి 2006లో భారత్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎగుమతులతో కలిపి 4.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 17 లెవెల్‌ 2- అడాస్‌ ఫీచర్లు, 65 కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు సహా మొత్తం 30 ప్రామాణిక భద్రతా ఫీచర్లు కొత్త వెర్నా (Hyundai Verna)లో పొందుపర్చినట్లు హ్యుందాయ్‌ ఇండియా తెలిపింది. 1.5 లీటర్‌ జీడీఐ పెట్రోల్‌ ఇంజిన్‌ 250 ఎన్‌ఎం టార్క్‌ వంటి 157 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేయనుంది. 8.1 సెకన్లలో ఇది 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ముందు భాగంలో వెంటిలేటెడ్‌ అండ్‌ హీటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 12 భాషల్ని సపోర్ట్‌ చేసే 10.25 అంగుళాల హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది 40 వేల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ఎంఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. క్రితం ఏడాది 19 వేల యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 8,000 బుకింగ్స్‌ అందినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని