Hyundai Ioniq 6: టెస్లాకు పోటీగా హ్యుందాయ్‌ అయోనిక్‌-6

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (Electric Vehicles)కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌

Published : 14 Jul 2022 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (Electric Vehicles)కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ (Hyundai) వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా టెస్లాకు పోటీగా అయోనిక్‌6 (Ioniq6) పేరిట ఓ సెడాన్‌ కారును గురువారం ఆవిష్కరించింది. 2030 నాటికి హ్యుందాయ్‌ 31 ఈవీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.


హ్యుందాయ్‌ (Hyundai) నుంచి వస్తోన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టెస్లాకు చెందిన మోడల్‌3 కూడా సెడాన్‌ సెగ్మెంట్‌ కారే కావడంతో దానిపై పైచేయి కోసమే హ్యుందాయ్‌ ప్రత్యేకంగా అయోనిక్‌6 (Ioniq6)ను తీసుకొస్తోందని వాహన పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


వెహికల్‌-టు-లోడ్‌ (V2L) అయోనిక్‌6 (Ioniq6)లో ఉన్న అత్యాధునిక ఫీచర్‌. దీంతో ఎలక్ట్రికల్‌ పరికరాలకు ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి కారు లోపలి నుంచే కాకుండా బయట కూడా ప్రత్యేకంగా ఔట్‌లెట్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జనరల్‌ ఎలక్ట్రిక్‌ కార్లలో మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.


ప్రస్తుతం అయోనిక్‌6 (Ioniq6)ని కొరియన్‌ మార్కెట్‌లో మాత్రమే విడుదల చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని హ్యుందాయ్‌ వెల్లడించింది. కొరియన్‌ మార్కెట్‌లో దీని ధర 55 మిలియన్‌ వోన్‌లు (41,949.51 డాలర్లు). భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.33.50 లక్షలు.


ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 800వోల్టుల అల్ట్రా-ఫాస్ట్‌ బ్యాటరీ సిస్టమ్‌తో 10% నుంచి 80% ఛార్జింగ్‌కు కేవలం 18 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 185 కి.మీ.


స్టీరింగ్‌ వీల్‌పై 4 రకాల పిక్సెల్‌ లైట్స్‌ వెలిగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కారు స్థితిని బట్టి వాటి రంగు మారుతూ ఉంటుంది.


దీంట్లో మొత్తం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లతో వస్తోంది. ఇది 605 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 320 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీంట్లో 77.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ అమర్చారు. మరొకటి 55 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, సింగిల్‌ మోటార్‌తో వస్తోంది. అయితే, దీని టార్క్‌, శక్తికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని