Hyundai Motor India: హ్యుందాయ్‌ రూ.25,000 కోట్ల ఐపీఓ

దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ తన భారత విభాగాన్ని పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు తీసుకురానుంది. కనీసం 3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది.

Published : 15 Jun 2024 02:50 IST

త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశం

దిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ తన భారత విభాగాన్ని పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు తీసుకురానుంది. కనీసం 3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఈ విషయాలతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక వేళ అదే జరిగితే ఎల్‌ఐసీ ఐపీఓ (రూ.21,000 కోట్లు)ను అధిగమించి దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్న తొలి వాహన కంపెనీ కూడా ఇదే అవుతుంది. 2003లో జపాన్‌ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ నుంచి ఈ వారం మొదట్లో అనుమతులు దక్కడం గమనార్హం. 

15-20 శాతం వాటా విక్రయం: ప్రతిపాదిత ఐపీఓ కింద హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా(హెచ్‌ఎమ్‌ఐఎల్‌) 15-20 శాతం వాటాను విక్రయించి 3- 5.6 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పత్రాలను సెబీకి సమర్పించనుందని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి హెచ్‌ఎమ్‌ఐఎల్‌ కంపెనీ నిరాకరించింది. 1996లో భారత్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం 13 మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో 7% వృద్ధితో 63,551 వాహనాలను ఇది విక్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు