ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు చేతులు కలిపిన హ్యుందాయ్‌, టాటా పవర్‌

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో విద్యుత్తు వాహనాల కోసం ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది....

Updated : 17 May 2022 14:13 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో విద్యుత్తు వాహనాల కోసం ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు టాటా పవర్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం కింద దేశవ్యాప్తంగా 29 నగరాల్లోని 34 విద్యుత్తు వాహన డీలర్‌షిప్‌లలో 64 కేడబ్ల్యూ, డీసీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

కర్బన రహిత వాతావరణ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలాంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు చాలా అవసరమని హ్యుందాయ్‌ మోటార్‌ ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ తెలిపారు. ఇందులో భాగంగా హ్యుందాయ్‌ స్థలం, నిర్వహణ వసతులు అందజేయనుండగా.. టాటా పవర్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల మెయింటెనెన్స్‌, ఆపరేషన్లను చూసుకోనుంది. హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కార్లు వినియోగిస్తున్న వారికి ప్రత్యేక టారిఫ్‌లు అందజేస్తామని కంపెనీ వెల్లడించింది.

హ్యుందాయ్‌ నుంచి ప్రస్తుతం కోన ఎలక్ట్రిక్‌ పేరిట ఓ విద్యుత్తు కారు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది పండగ సీజన్‌లో మరో కొత్త కారును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2028 నాటికి మొత్తం 8 ఈవీ మోడళ్లు అందుబాటులోకి తెస్తామని.. అందుకోసం రూ.4,000 కోట్లు వెచ్చించనున్నామని కంపెనీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని