నేనూ మధ్య తరగతి నుంచే వచ్చా.. వాళ్ల కష్టాలు తెలుసు: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman on Middle class: మధ్య తరగతి నేపథ్యం ఉన్న తనకు వారి కష్టాలు తెలుసని నిర్మలా సీతారామన్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం వారి కోసమే పనిచేస్తోందని, మున్ముందు మరిన్ని చేయబోతున్నట్లు చెప్పారు. 

Updated : 21 Jan 2023 14:18 IST

దిల్లీ: మధ్యతరగతి (Middle class) కష్టాలు తనకు తెలుసని, తానూ అదే నేపథ్యం నుంచి వచ్చానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక వారిపై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదని చెప్పారు. మన్ముందూ వారి కోసమే మోదీ ప్రభుత్వం పనిచేబోతోందని తెలిపారు. ఆరెస్సెస్‌కు చెందిన పాంచజన్య మ్యాగజైన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. త్వరలో బడ్జెట్‌ (Budget-2023) ప్రవేశపెట్టనున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో పెద్ద ఎత్తున మధ్యతరగతికి తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని (Income tax) పెంచుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యతరగతి గురించి ప్రస్తావించడం గమనార్హం. 

‘‘నేను మధ్యతరగతి నుంచే వచ్చా. మధ్యతరగతి కష్టాలేంటో తెలుసు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మధ్య తరగతిపై ఎలాంటి కొత్త పన్నులూ వేయలేదు. రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ట్యాక్సులూ వేయలేదు’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 27 నగరాల్లో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, 100 స్మార్ట్‌సిటీలు నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మధ్య తరగతి కోసం మోదీ ప్రభుత్వం మరింత చేయబోతోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 2020 బడ్జెట్‌ నుంచి ఏటా మూలధన వ్యయం పెంచుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రక్షాళన కారణంగా ఎన్‌పీఏలు గణనీయంగా తగ్గాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మెరుగైందన్నారు. దాదాపు ఆయా బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల మూలధన సాయం అందించామని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకులన్నీ రూ.31,820 కోట్ల నికర లాభాన్ని ప్రకటించాయన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెట్టింపు లాభాన్ని పొందాయని గుర్తుచేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉచితాలు ప్రకటించే విషయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హామీలు ప్రకటించాలని సూచించారు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని