IBM: వచ్చే ఐదేళ్లలో ఐబీఎంలో 7,800 ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధ!

IBM: కృత్రిమ మేధ వినియోగానికి పెద్ద పీట వేసేందుకు ఐబీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక విధుల్లో ఈ అత్యాధునిక సాంకేతికతను వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

Published : 02 May 2023 11:39 IST

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ఎక్కడ ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తుందోనని ఓవైపు ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ అత్యాధునిక సాంకేతికతలో రోజురోజుకీ కొత్త మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో అనేక ఉద్యోగాల్లో ఏఐ (Artificial Intelligence) తిష్ఠ వేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రానున్న ఐదేళ్లలో కంపెనీలోని చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించాలని ఐబీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు ఆయా విధుల్లోకి కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఆపేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తగిన మార్పులు చేయాలని సంబంధిత ఉన్నతోద్యోగులకు కంపెనీ సీఈఓ అర్వింద్‌ కృష్ణ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది.

అమెజాన్‌ సహా పలు దిగ్గజ కంపెనీలు ఇటీవల భారీ ఎత్తున మానవ వనరుల విభాగంలో ఉద్యోగులను తొలగించాయి. వారి స్థానంలో కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించుకుంటున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఆయా కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే ఐబీఎం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. కొన్ని వ్యాపార విభాగాలను పూర్తిగా తొలగించేసింది. 

దాదాపు 7,800 మంది ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించే అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐబీఎం సీఈఓ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అయితే, ఐబీఎం ఓవైపు ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు నియామకాలను సైతం కొనసాగిస్తోంది. తొలి త్రైమాసికంలో దాదాపు 7000 మంది కొత్త వారిని కంపెనీలోకి ఆహ్వానించినట్లు సీఈఓ తెలిపారు.

మోర్గాన్‌ స్టాన్లీలో 3000 ఉద్యోగాల కోత!

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు శాతానికి సమానమైన 3,000 మందికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. ప్రస్తుత త్రైమాసికం పూర్తయ్యే నాటికి తొలగింపుల ప్రక్రియ పూర్తి కావొచ్చని వెల్లడించారు. అయితే, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్న ఆర్థిక సలహాదారులు, వారికి సహాయంగా ఉన్న సిబ్బందిని మాత్రం తొలగించకపోవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని