Rent payment Fee: క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ పే చేస్తున్నారా? ఇక వాతే..!

Rent payment: క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ పే ఆప్షన్‌ వినియోగించుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. ఐసీఐసీఐ బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారుల నుంచి ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది.

Updated : 20 Sep 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డు (Credit card) ద్వారా రెంట్‌ పే (Rent payment) ఆప్షన్‌ వినియోగించుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI bank) తన క్రెడిట్‌ కార్డు వినియోగదారుల నుంచి ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ వినియోగించుకుని చేసే పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని పేర్కొంది. అక్టోబర్‌ 20 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు తమ వినియోగదారులకు ఇప్పటికే సందేశాలు పంపుతోంది.

క్రెడ్‌ (CRED), పేటీఎం (Paytm), మ్యాజిక్‌ బ్రిక్స్‌ (Magicbricks)‌, రెడ్‌ జిరాఫీ (RedGiraffe) వంటి థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఇందుకోసం అర శాతం నుంచి 2 శాతం వరకు ఫీజును వసూలు చేస్తున్నాయి. కేవలం ల్యాండ్‌లార్డ్‌ పేరు, అకౌంట్‌ వివరాల ఆధారంగా రెంట్‌ను పే చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఛార్జీలు విధించేందుకు ముందుకొచ్చింది. ఉదాహరణకు రూ.10వేలు రెంట్ పేమెంట్‌ కోసం 2 శాతం చొప్పున థర్డ్‌ పార్టీ వేదికలను ఉపయోగించుకుంటే.. రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఐసీఐసీఐ బ్యాంక్‌ వినియోగదారులు ఆ మొత్తంపై అదనంగా 1 శాతం ఫీజు చెల్లించాలి. అంటే రూ.102 ఫీజు అదనంగా చెల్లించాలి. అంటే రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ వినియోగించుకుంటే దాదాపు 3 శాతం వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు.

ఎందుకీ ఫీజు..?

రెంట్‌ పేమెంట్‌, మెయింటెయినెన్స్‌ అనేవి పైకి చెప్పే మాటలే. వాస్తవంలో జరిగేది వేరు. చాలా మంది వినియోగదారులు తమ అవసరాలకు నగదు అవసరం అయినప్పుడు ఈ సేవలను వినియోగించుకుంటున్నారన్నది వాస్తవం. సాధారణంగా క్రెడిట్‌కార్డుల నుంచి నేరుగా నగదు పొందాలంటే భారీ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నుంచి తప్పించుకునేందుకు క్రెడిట్‌కార్డుదారులు ఈ ‘థర్డ్‌పార్టీ’ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంక్‌ 1 శాతం ఛార్జీలను తీసుకొచ్చింది. మున్ముందు ఇతర బ్యాంకులూ ఈ తరహా ఛార్జీలు విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని