Q3 Results: అదరగొట్టిన ప్రైవేటు బ్యాంకులు.. లాభంలో రెండంకెల వృద్ధి

ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్యూ3 ఫలితాలను ప్రకటించాయి. మూడు బ్యాంకులూ లాభంలో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి.

Published : 21 Jan 2023 20:39 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో (Q3 Results) ప్రైవేటు రంగ బ్యాంకులు అదరగొట్టాయి. ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తమ నికర లాభంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. వాటి ఆదాయాలు సైతం అదే స్థాయిలో వృద్ధి చెందాయి. ఈ మేరకు ఆయా ప్రైవేటు రంగ బ్యాంకులు శనివారం వరుసగా మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి.

ఐసీఐసీఐ లాభం 34 శాతం వృద్ధి..

ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 34 శాతం వృద్ధి చెందింది. స్టాండలోన్‌ పద్ధతిలో గతేడాది ఇదే సమయంలో రూ.6,194 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.8,312 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ ఆదాయం సైతం రూ.27,069 కోట్ల నుంచి రూ.33,529 కోట్లకు పెరిగింది. వడ్డీ ద్వారా వచ్చే నికర వడ్డీ ఆదాయం 34.6 శాతం వృద్ధి చెంది.. 16,465 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. వడ్డీ మార్జిన్‌ 4.65 శాతంగా ఉందని పేర్కొంది. స్థూల నిరర్థక ఆస్తులు 4.13 శాతం నుంచి 3.07 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు 0.84 శాతం నుంచి 0.55 శాతానికి చేరినట్లు పేర్కొంది. బ్యాంకు ఏకీకృత నికర లాభం 34.5 శాతం పెరిగి రూ.6,536 కోట్లకి చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ తెలిపింది.

కొటక్‌ లాభం రూ.2,792 కోట్లు

మరో ప్రైవేటు రంగ బ్యాంక్‌ కొటక్‌ మహీంద్రా సైతం స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.2,792 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది పోలిస్తే లాభం 31 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,260 కోట్ల నుంచి రూ.11,099 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ.4334 కోట్ల నుంచి రూ.5,653 కోట్లకు పెరిగిందని ఫైలింగ్‌లో పేర్కొంది. వడ్డీ మార్జిన్‌ 5.4 శాతంగా ఉందని తెలిపింది. స్థూల ఎన్‌పీలు 2.71 శాతం నుంచి 1.90 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీలు 0.43 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం డబుల్‌

ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నికర ఆదాయం రెట్టింపైంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.605 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ బ్యాంక్‌ తన ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది క్యూ3లో నికర లాభం రూ.281 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ ఆదాయం సైతం రూ.5,197.79 కోట్ల నుంచి రూ.7064.30 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.2,580 కోట్లకు పెరిగాయని, నికర ఎన్‌పీఏలు 1.74 శాతం నుంచి 1.03 శాతానికి తగ్గాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని