బోన‌స్‌ ప్ర‌క‌టించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్‌

దాదాపు 10 ల‌క్ష‌ల పాల‌సీదారులు ఈ బోన‌స్ నుండి ప్ర‌యోజ‌నం పొందుతారు. 

Updated : 24 Jun 2022 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త‌దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల‌లో ఒక‌టైన‌ ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్హులైన త‌న పాల‌సీదారులంద‌రికీ 2021-22 సంవ‌త్స‌రానికి గానూ రూ.968.8 కోట్ల వార్షిక బోన‌స్‌ను ప్ర‌క‌టించింది. ఈసారి ఇచ్చిన బోన‌స్ 16వ సంవ‌త్స‌రం బోన‌స్ చెల్లింపుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీదారుల‌కు ఇచ్చిన బోన‌స్‌ల‌లో ఇదే అత్య‌ధికం. సంప్రదాయ పాల‌సీల‌పై ప్రీమియం చెల్లిస్తున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీదారుల‌కు ఈ బోన‌స్ అందుతుంది.

2022 మార్చి 31 నాటికి అమ‌ల్లో ఉన్న అన్ని భాగ‌స్వామ్య పాల‌సీదారులు ఈ వార్షిక బోన‌స్‌ను స్వీక‌రించ‌డానికి అర్హ‌త క‌లిగి ఉంటారు. ఈ బోన‌స్ పాల‌సీదారుల ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు ఉత్ప్రేరకంగా ప‌నిచేస్తుంది. దాదాపు 10 ల‌క్ష‌ల పాల‌సీదారులు ఈ బోన‌స్ నుంచి ప్ర‌యోజ‌నం పొందుతారు. పాల‌సీదారులు దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి ఈ బోన‌స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ బీమా సంస్థ వార్షిక బోన‌స్‌గా గ‌తేడాది 2021 ఆర్ధిక సంవ‌త్స‌రంలో అర్హులైన భాగ‌స్వామ్య పాల‌సీదారులంద‌రికీ రూ.876 కోట్లు బోన‌స్‌గా అంద‌జేసింది. ఈ సంవ‌త్స‌రం ఇంత‌కంటే 10% ఎక్కువ బోన‌స్‌గా ప్ర‌క‌టించింది.

బోన‌స్ రూ.1,000 స‌మ్ అష్యూర్డ్‌కి నిర్దిష్ట మొత్తంగా లేదా హామీ మొత్తంలో శాతంగా ప్ర‌క‌టిస్తారు. ఉదా: హామీ మొత్తంలో ప్ర‌తి రూ.1000కి బోన‌స్ రూ.50 కావ‌చ్చు. కాబట్టి రూ.1 ల‌క్ష హామీతో కూడిన పాల‌సీకి, బోన‌స్ మొత్తం రూ.5,000 అవుతుంది. ఇదే విధంగా పై ఉదాహ‌ర‌ణ‌లో పాల‌సీ వ్య‌వ‌ధి ప‌దేళ్లు అయితే మెచ్యూరిటీపై సేక‌రించిన మొత్తం బోన‌స్ సుమారుగా రూ.50,000 అవుతుంది.

పాల‌సీల‌లో రాబ‌డి పూర్తిగా బోన‌స్‌ల‌పై ఆధార‌ప‌డి ఉండ‌క‌పోవ‌చ్చు. బ‌దులుగా అటువంటి పాల‌సీల్లో పాల‌సీకి గ్యారంటీడ్ అడిష‌న్‌ (జీఏ) ఉంటుంది. బోన‌స్ బీమా సంస్థ లాభంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే గ్యారంటీడ్ అడిష‌న్‌ అనేది పాల‌సీకి హామీ ఇచ్చిన దానికి అద‌నంగా ఉంటుంది. పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు పాల‌సీదారుకు గ్యారంటీడ్ అడిష‌న్‌ గురించి ముంద‌స్తుగా తెలియ‌చేస్తారు. పాల‌సీదారుగా మీరు ప్ర‌క‌టించిన బోన‌స్‌కు అర్హులు అవునా/ కాదా అని మీ పాల‌సీ డాక్యుమెంట్‌ని త‌నిఖీ చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని