Union Budget 2022: ఈ బడ్జెట్ల రూటే సపరేటు..!

సరైన బడ్జెట్‌ ఒక్కటి వస్తే చాలు దేశ భవితనే మార్చేస్తుంది.. భారత్‌లో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అటువంటివి కొన్ని ఉన్నాయి. దేశ పౌరులు, రాజకీయలపై పెను ప్రభావాలను చూపాయి.

Updated : 01 Feb 2022 10:30 IST

 ఐకానిక్‌ బడ్జెట్లు ఇవీ..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సరైన బడ్జెట్‌ ఒక్కటి వస్తే చాలు దేశ భవితనే మార్చేస్తుంది.. భారత్‌లో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అటువంటివి కొన్ని ఉన్నాయి. దేశ పౌరులు, రాజకీయాలపై పెను ప్రభావాలను చూపాయి. మూసధోరణని పక్కకు నెట్టి దూసుకొచ్చిన ఈ బడ్జెట్లను చరిత్రలో ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వాటిల్లో కొన్ని..

ది బ్లాక్‌ బడ్జెట్‌..

1973-74 సంవత్సరానికి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వైబీ చవాన్‌ ప్రవేశ పెట్టిన పద్దును ‘బ్లాక్‌ బడ్జెట్‌’ అని పిలుస్తారు. అప్పట్లో ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటు రూ.550 కోట్లు ఉంది. భారత్‌ తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. ఈ బడ్జెట్‌లో బీమా కంపెనీలు, బొగ్గు గనులను జాతీయం చేశారు.

క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌..

1986 ఫిబ్రవరి 28న కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వీపీ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘క్యారెట్‌ అండ్‌ స్టిక్‌’ బడ్జెట్‌గా పిలుస్తారు. లైసెన్స్‌ రాజ్‌గా  పిలిచే వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తొలి సారి దీనిలో చర్యలు తీసుకొన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు- దండనలు రెండు ఉన్నాయి. అందుకే క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌గా పిలిచేవారు. దీనిలో మాడిఫైడ్‌ వ్యాల్యూడ్‌ యాడెడ్‌ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. పన్ను మీద పన్ను పడకుండా ఈ చర్యలు తీసుకొన్నారు. దీంతోపాటు స్మగ్లర్లు, బ్లాక్‌ మార్కెట్లు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకొన్నారు.

నవశకానికి నాందిపలికన బడ్జెట్‌..

1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ చరిత్రనే మార్చేసింది. దేశంలోని ‘లైసెన్స్‌ రాజ్‌’కు పూర్తిగా ముగింపు పలికారు. దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఆర్థిక సరళీకరణకు నాంది పలికింది. ఇది ‘ఎపోకల్‌ బడ్జెట్‌’గా పేరు తెచ్చుకొంది. భారత్‌ ఆర్థిక పతనం అంచున నిలిచిన సమయంలో ఎంతో సాహసోపేతంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. ఆ సమయంలో కస్టమ్స్‌ డ్యూటీని 220శాతం నుంచి 150శాతానికి తగ్గించారు.

డ్రీమ్‌ బడ్జెట్‌..

1997-98 పద్దును డ్రీమ్‌ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొలిసారి లాఫెర్‌ కర్వ్‌ సిద్ధాంతాన్ని వాడి పన్ను రేట్లు తగ్గించారు. ఈ సిద్ధాంతం పన్ను రేట్లు, ప్రభుత్వ పన్ను ఆదాయం మధ్య సంబంధాన్ని వెల్లడిస్తుంది. ఈ బడ్జెట్‌లో వ్యక్తులపై ఆదాయపు పన్ను రేటును 40శాతం నుంచి 30శాతానికి కుదించారు. అదే కంపెనీలకు 35శాతంగా ఉంచారు. దీంతోపాటు బ్లాక్‌ మనీని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు స్వచ్ఛందగా నల్లధన వివరాల వెల్లడి పథకం వంటివి ప్రకటించారు. దీనిని డ్రీమ్‌ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీని 40శాతం దగ్గరకు చేర్చారు. అదే సమయంలో ఎక్సైజ్‌ డ్యూటీని సరళీకరించారు.

మిలీనియం బడ్జెట్‌..

2000 సంవత్సరంలో ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భారత్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ల ఎగుమతులపై ప్రోత్సహకాలను నిలిపివేసి.. కంప్యూటర్లతో సహా 21 పరికరాల దిగుమతిపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారు. 

రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌

2002-03 ఆర్థిక సంవత్సరానికి యశ్వంత్‌ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రోల్‌బ్యాక్ బడ్జెట్‌గా పిలుస్తారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవడమో, రద్దు చేయడమో చేశారు. 

వందేళ్లకోసారి వచ్చే బడ్జెట్‌..

2021 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన పద్దును వందేళ్లకు ఓసారి వచ్చే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అభివర్ణించారు. భారీగా ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి భారత ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో దూకుడుగా ప్రైవేటీకరణ, బలమైన పన్ను వసూళ్లపై ప్రభుత్వం ఆధారపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని