Updated : 19 Jul 2022 14:46 IST

మీ నుంచి డిడ‌క్ట్ చేసిన‌ TDS ప్ర‌భుత్వానికి చేరలేదా? ఏం చేయాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయంపై ప‌న్నుల‌ను స‌మ‌ర్థ‌ంగా, త్వ‌రగా సేక‌రించేందుకు, ప‌న్ను ఎగ‌వేత‌ల‌ను అరిక‌ట్టేందుకు ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టిన విధాన‌మే మూలం వ‌ద్ద ప‌న్ను (TDS). సుల‌భంగా చెప్పాలంటే.. మీరు పొందుతున్న ఆదాయంపై మూలం వ‌ద్ద‌నే ప‌న్ను వ‌సూలు చేయ‌డం. మీరు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తులైతే.. మీకు చెల్లించాల్సిన నెల‌వారి వేత‌నం నుంచి TDSను క‌ట్ చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే మీ ఖాతాకు వేత‌నాన్ని జ‌మ‌చేస్తారు. మీ నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్ని సంస్థ ప్ర‌భుత్వానికి చెల్లిస్తుంది. బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌డ్డీ ఆదాయం పొందేవారు, అద్దె ఆదాయం, ఆస్తి అమ్మిన‌ప్పుడు, డివిడెండ్లు వంటి వాటిపై వ‌చ్చిన ఆదాయంపై కేట‌గిరి ఆధారంగా 1 నుంచి 20 శాతం వ‌ర‌కు TDS వ‌ర్తిస్తుంది.

టీడీఎస్ త‌గ్గించుకోవాలంటే..?
సంస్థ మీ నుంచి డిడ‌క్ట్ చేసే TDSను త‌గ్గించుకోవాలంటే.. మీరు ఇప్ప‌టికే చేసిన ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను మీ సంస్థకి అందించాలి. యాజ‌మాన్యం మీ ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌ను అనుస‌రించి.. మిన‌హాయింపు ఉన్నంత వ‌ర‌కు ఆదాయం నుంచి పెట్టుబ‌డుల‌ను త‌గ్గించి, మిగిలిన మొత్తంపై వ‌ర్తించే స్లాబ్ ప్ర‌కారం TDS డిడ‌క్ట్ చేస్తుంది. ఒక‌వేళ మీ వ‌డ్డీ ఆదాయం పై బ్యాంక్ TDS క‌ట్ చేస్తుంటే.. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం లేని వారు ఫారం 15జి & 15హెచ్‌ ఇచ్చి TDS క‌ట్ చేయ‌కుండా చూసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఎక్కువ TDSను క‌ట్ చేస్తే, ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసి అద‌న‌పు మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

TDS ప్ర‌భుత్వం వ‌ద్ద డిపాజిట్ చేయ‌క‌పోతే..
TDS డిడ‌క్టర్లు.. తాము త‌గ్గించిన TDSను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వం వ‌ద్ద జ‌మ చేయాలి. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను మీరు డిడ‌క్ట‌ర్ నుంచి పొందొచ్చు. జీతం ద్వారా ఆదాయం పొందే వారు ఫారం 16ని.. TDS స‌ర్టిఫికెట్‌గా గుర్తించాలి. ఒక‌వేళ డిడ‌క్ట‌ర్లు మీకు TDS స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఫారం 26ఏఎస్ ద్వారా మీ TDS వివ‌రాలు పొందొచ్చు. దీన్ని ఐటీ శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఒక‌వేళ మీ ఆదాయం నుంచి TDS త‌గ్గించిన‌ప్ప‌టికీ అది ఫారం 26ఏఎస్‌లో ప్ర‌తిబింబించ‌క‌పోతే.. త‌గ్గించిన‌ TDSను ప్ర‌భుత్వం వ‌ద్ద డిపాజిట్ చేయ‌లేద‌ని అర్థం. అటువంటి సంద‌ర్భంలో TDSను ప్ర‌భుత్వానికి డిపాజిట్ చేయ‌మ‌ని మీరు డిడ‌క్ట‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. ఒక‌వేళ డిడ‌క్ట‌ర్, ప‌న్ను చెల్లింపుదారుని అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించిన‌ట్ల‌యితే, TDS త‌గ్గింపున‌కు సంబంధించిన‌ రుజువుల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 

ఇందుకోసం ఐటీఆర్‌ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ స‌మ‌యంలో TDS క్రెడిట్‌ని క్లెయిమ్ చేసి రిట‌ర్నుల ప్రాసెసింగ్ కోసం వేచి చూడాలి. ప్రాసెసింగ్‌లో TDS వివ‌రాల స‌రిపోల‌క‌పోతే ఐటీ శాఖ మీకు నోటీసులు పంపుతుంది. నోటీసులు అందుకున్న త‌ర్వాత‌, ప‌న్ను చెల్లింపుదారు త‌న ఆదాయం నుంచి TDS సక్ర‌మంగా తగ్గించార‌నే రుజువుల‌ను చూపించ‌వ‌చ్చు. ఇందుకోసం జీతం స్లిప్‌ల‌ను, బ్యాంకు స్టేట్‌మెంట్ల‌ను జ‌త‌చేయ‌వ‌చ్చు. మీ నుంచి TDS ముందుగానే క‌ట్ చేసుకున్న‌ట్లు అసెస్సింగ్ అధికారి గుర్తిస్తే సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంట‌ర్ జారీ చేసిన నోటీసుల‌ను ర‌ద్దు చేసి TDS క్లెయిమ్‌ను అనుమ‌తిస్తారు. ఒక‌వేళ క్లెయిమ్‌ను నిరాక‌రిస్తే.. కోర్టుని ఆశ్ర‌యించ‌వ‌చ్చు. 

గ‌డువులోపు రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే, టీడీఎస్ రెట్టింపు..
ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139, స‌బ్‌సెక్ష‌న్(1) ప్రకారం, మదింపు సంవ‌త్స‌రం 2022-23 సంబంధించిన రిట‌ర్నుల‌ను ప‌న్ను చెల్లింపుదారులు 2022 జులై 31లోపు స‌మర్పించాలి. ఒకవేళ ఆలోపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే ఆ తర్వాత నుంచి వచ్చే ఆదాయంపై రెట్టింపు టీడీఎస్‌ను చెల్లించాల్సి రావ‌చ్చు. అందువ‌ల్ల ప‌న్ను చెల్లింపుదారులు వీలైనంత త‌ర్వ‌గా ఐటీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని