Updated : 26 Jan 2022 15:16 IST

Budget 2022: బడ్జెట్‌లో ఈ ప్రకటనే ఉంటే.. 15 ఏళ్లలోరూ.80 లక్షలు పొందొచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యంత ప్రజాద‌ర‌ణ పొందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పీపీఎఫ్ (PPF) ఒక‌టి. పెట్టుబ‌డుల‌కు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబ‌డి అందిస్తున్న ప‌థ‌కం ఇది. ఇందులో అస‌లు, వ‌డ్డీ రెండింటిపైనా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అందువ‌ల్ల దీన్ని సేవింగ్స్‌ క‌మ్ టాక్స్‌ సేవింగ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ ప‌థకంలో గ‌రిష్ఠంగా సంవ‌త్సరానికి రూ.1.50 ల‌క్షల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా నిర్వహ‌ణ కోసం వార్షికంగా క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈసారి బడ్జెట్‌ (Union Budget 2022) నుంచి సామాన్యులు పీపీఎఫ్‌ విషయంలో ఎలాంటి ఉపశమనం ఆశిస్తున్నారో చూద్దాం..!

పీపీఎఫ్‌తో ఎవరికి ప్రయోజనం..

వార్షిక పెట్టుబడులు రూ.1.50 లక్షలకు పరిమితం అయినప్పటికీ, సురక్షితమైన స్థిర-ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, పెట్టుబ‌డి కాలంలో ఆర్జించిన వ‌డ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. కాబ‌ట్టి ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌ను నిపుణులు ప్రోత్సహిస్తుంటారు. ముఖ్యంగా వేతన ఆదాయం లేనివారికీ, స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికీ ప్రభుత్వం హామీ ఉన్న మేలైన పెట్టుబడి పథకం ఇదొకటే.

బడ్జెట్‌ నుంచి ఏం కోరుకుంటున్నారు?

అయితే, వార్షిక డిపాజిట్‌ మొత్తం రూ.1.50 లక్షలకే పరిమితం కావడంతో దీనివల్ల సామాన్యులు పెద్దగా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఆర్థిక పరిస్థితులు తలకిందులైన నేపథ్యంలో మెరుగైన పెట్టుబడి పథకాన్ని సామాన్యులకు అందజేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకనుగుణంగా పీపీఎఫ్‌ డిపాజిట్‌ పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించి బడ్జెట్‌ (Union Budget 2022)లో ఉపశమనం కల్పించాలని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI)’ కోరింది.

80సి పరిమితి పెంచితేనే ప్రయోజనం...

పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన రూ.1.5 లక్షలకు సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు పొందే గరిష్ఠ మొత్తం కూడా రూ.1.5 లక్షలే కావడంతో.. పీపీఎఫ్‌లో జమ చేసే మొత్తానికీ పన్ను రాయితీ లభిస్తున్నట్లవుతోంది. అయితే, సామాన్యులకు ఊరట కల్పిస్తూ డిపాజిట్‌ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. సెక్షన్‌ 80సి (Section 80C) పరిమితిని సైతం అంతే మొత్తానికి పెంచాలని నిపుణులు కోరుతున్నారు. లేదంటే జమ పరిమితిని పెంచిన ప్రయోజనం సామాన్యులకు అందదని వివరించారు.

ఒకవేళ రూ.3 లక్షలకు పెంచితే...

ప్రస్తుతం ఉన్న పీపీఎఫ్‌ విధానం ప్రకారం.. ఏటా రూ.1.5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 7.1 శాతం వడ్డీ లెక్కన 15 ఏళ్లలో రూ.40లక్షలు పొందవచ్చు. ఒకవేళ ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. పీపీఎఫ్‌ మెచ్యూరిటీ సమయానికి రూ.80 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది సాధ్యం కావాలంటే సెక్షన్‌ 80సి పరిమితి పెంపుతో పాటు ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇదే జరిగితే పీపీఎఫ్‌ కాలపరిమితిని ఐదేళ్ల చొప్పున పెంచుకునే అవకాశం ఉండడంతో మెచ్యూరిటీ సమయానికి మరింత ఎక్కువ సొమ్మును పొందవచ్చు. వృద్ధాప్యంలో ఇది ఎంతో భరోసాగా ఉంటుంది.

రుణమూ ఎక్కువ వస్తుంది...

పీపీఎఫ్‌ ఖాతా తెరిచిన 3-5 సంవ‌త్స‌రాల మ‌ధ్య రుణం పొందే వెసులుబాటు కూడా ఉంది. పీపీఎఫ్‌ ఖాతాలో ఉన్న సొమ్ముపై గరిష్ఠంగా 25 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు పీపీఎఫ్ వడ్డీ కంటే 1 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జమ పరిమితిని పెంచితే.. రుణం మొత్తం సైతం పెరుగుతుంది. అత్యవసర సమయాల్లో ఇది సామాన్యులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో సమంజసమే..

ద్రవ్యోల్బణం, కొవిడ్‌ కొత్త వేరియంట్లు, నిరుద్యోగం వంటి సమస్యల నేపథ్యంలో సామాన్యులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలంటే.. పీపీఎఫ్‌ పరిమితి పెంచడమే మేలైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. పైగా 2014 నుంచి పీపీఎఫ్‌ పరిమితిలో ఎలాంటి సవరణ లేదు. నాటికీ.. నేటికీ.. పరిస్థితుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకొని పీపీఎఫ్‌ డిపాజిట్‌ పరిమితిని పెంచాలని ఐసీఏఐ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా స్వయం ఉపాధి, వేతన ఆదాయం లేని వారికి ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని