Health insurance: బీమా పాలసీ తీసుకునేటప్పుడు అనారోగ్య సమస్యను వెల్లడించకపోతే?

ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు అప్పటికే ఉన్న అన్ని అనారోగ్య సమస్యల గురించి బీమా సంస్థలకు తెలియజేయాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది....

Published : 21 Sep 2022 12:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీని భవిష్యత్తులో రాబోయే అనారోగ్యం, ప్రమాదాల నుంచి రక్షణ కోసం తీసుకుంటాం. అయితే, మధుమేహం లేదా హైపర్‌టెన్షన్ వంటి జబ్బులు ముందుగానే ఉన్నట్లయితే పాలసీ తీసుకునేటప్పుడే వాటిని వెల్లడించాలి. అధిక ప్రీమియం లేదా ఎక్కువ ‘వెయిటింగ్‌ పీరియడ్‌’తో సంస్థలు బీమా కవర్‌ను అందించే అవకాశం ఉంది. ఒకవేళ పాలసీ కొనుగోలు సమయంలో ముందుగా ఉన్న అనారోగ్య సమస్యను ఉద్దేశపూర్వకంగా లేదా ఇతర కారణాల వల్ల బీమా సంస్థకు తెలియజేయకపోతే? ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం..

పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి..

అనారోగ్యానికి సంబంధించిన విషయాలను ముందుగానే బీమా సంస్థలకు తెలియజేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చికిత్స కోసం క్లెయిమ్‌కు వెళితే.. వాటిని సంస్థలు తిరస్కరించవచ్చు. పాలసీని రద్దు కూడా చేయవచ్చు. చికిత్స వెల్లడించని జబ్బుకు సంబంధించినది కాకపోయినప్పటికీ.. సంస్థలు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే, ఎముకలు విరగడం, అపెండిసైటిస్‌ శస్త్రచికిత్స, కొవిడ్‌-19 వంటి పెద్ద ప్రమాదం లేని అనారోగ్య సమస్యల్ని బహిర్గతపర్చనప్పటికీ పెద్ద సమస్య ఉండదు. కానీ, దీర్ఘకాల చికిత్స అవసరమయ్యే రక్తపోటు, మధుమేహం వంటి వాటిని మాత్రం కచ్చితంగా వెల్లడించాల్సిందే.

ఫ్రీ-లుక్‌ వ్యవధిలో వెల్లడించండి..

పాలసీని కొనుగోలు చేసిన తర్వాత ఉండే 15-రోజుల ‘ఫ్రీ-లుక్ వ్యవధి’ (పాలసీని రద్దు చేసుకునేందుకు ఉండే సమయం) ఇంకా ముగియకపోతే, వీలైనంత త్వరగా అనారోగ్య సమస్యని తెలియజేయొచ్చు. అప్పుడు నిబంధనల ప్రకారం సంస్థలు పాలసీలో మార్పులు చేసి కొనసాగిస్తాయి. లేదా మరో పాలసీని తీసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మాత్రం భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్‌లో ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎనిమిదేళ్ల నిబంధన..

అయితే, ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం.. ఎనిమిదేళ్లు క్రమం తప్పుకుండా ప్రీమియం చెల్లించిన పాలసీలను రద్దు చేయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జబ్బు విషయం బయటకు వచ్చినా.. పాలసీని రద్దు చేసే అధికారం సంస్థలకు ఉండదు.

పాలసీ కొన్న తర్వాత జబ్బు వస్తే..

పాలసీని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే, అది పెద్ద అడ్డంకి కాదు. ఆరోగ్య బీమా పాలసీలు ఆసుపత్రిలో చేరడానికి దారితీసే అనారోగ్యాలను కవర్ చేస్తాయి. మినహాయింపు ఉన్న జబ్బులకు తప్ప మిగిలిన వాటన్నింటికీ బీమా వర్తిస్తుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే తెలియని ఏదైనా వ్యాధి ఉండి తర్వాత గుర్తించినా.. బీమా వర్తిస్తుంది. కాబట్టి పాలసీ పునరుద్ధరణ సమయంలో కొత్తగా గుర్తించిన అనారోగ్యాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా పాలసీ ప్రీమియం మాత్రం మారదు.

స్వచ్ఛందంగా వెల్లడించినా..

ఒకవేళ పాలసీ పునరుద్ధరణ సమయంలో స్వచ్ఛందంగా మీరు కొత్తగా గుర్తించిన అనారోగ్య సమస్యను బహిర్గతం చేసినప్పటికీ.. ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే బీమా కంపెనీలు ఇలాంటి విషయాల్లో తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని సంస్థలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తాయి. కొన్ని రద్దు చేసి కొత్త పాలసీని ఆఫర్‌ చేస్తాయి. మరికొన్ని ప్రీమియం మొత్తాన్ని పెంచి పాలసీని అలాగే ఉంచుతాయి. ఇంకా కొన్ని సంస్థలు ఆ జబ్బును పాలసీ నుంచి మినహాయిస్తాయి. ఈ నేపథ్యంలో క్లెయిమ్‌ తిరస్కరణ ముప్పును తప్పించుకోవాలంటే పారదర్శకంగా ఉండడమే మేలు.

ప్రత్యామ్నాయం చూసుకోండి..

అయితే, అనారోగ్య సమస్యను తెలియజేసిన తర్వాత సంస్థలు పాలసీని రద్దు చేస్తామని తెలియజేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలి. ఇతర సంస్థలకు పోర్ట్‌ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సంస్థలు కొత్తగా గుర్తించిన అనారోగ్య సమస్యను తెలియజేసినప్పటికీ.. పాలసీని యథాతథంగా కొనసాగించడానికి అంగీకరిస్తాయి. అలాంటి వాటికి బదిలీ చేసుకోవడం మేలు. అయితే, అప్పుడు మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని