IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్‌మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!

IIT Madras: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల నుంచి అంకుర సంస్థల వరకు ఉద్యోగ ఆఫర్లతో ఐఐటీ మద్రాస్‌కు క్యూ కట్టాయి....

Published : 10 Aug 2022 19:01 IST

చెన్నై: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల నుంచి అంకుర సంస్థల వరకు ఉద్యోగ ఆఫర్లతో ఐఐటీ మద్రాస్‌కు క్యూ కట్టాయి. ప్లేస్‌మెంట్ల విషయంలో 2021-22 విద్యా సంవత్సరంలో ఈ సంస్థ రికార్డు నెలకొల్పింది. తొలి, రెండో దశలో మొత్తం 1,199 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఎంపికయ్యారు. దాదాపు 380 కంపెనీలు విద్యార్థులకు తమ సంస్థల్లో అవకాశాలిచ్చాయి.

మరో 231 మంది ప్లేస్‌మెంట్ల కంటే ముందే ఇంటర్న్‌షిప్‌లలో ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. దీంతో మొత్తం ఈ ఏడాది 1,430 మందికి ఉద్యోగాలు లభించాయి. 2018-19లో వచ్చిన 1,151 ఉద్యోగ నియామకాలే ఇప్పటి వరకు గరిష్ఠం కాగా.. ఈసారి ఆ రికార్డు మార్కు దాటిపోవడం విశేషం. ఈసారి 45 మంది విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. రకుటెన్‌ మొబైల్‌, గ్లీన్‌, మైక్రాన్‌ టెక్నాలజీస్‌, హోండా ఆర్‌అండ్‌డీ, కోహెస్టీ, డావిన్సీ డెరివేటివ్స్‌, అసెంచర్‌ జపాన్‌, హైల్యాబ్స్‌, క్వాంట్‌బాక్స్‌ రీసెర్చ్‌, మీడియా టెక్‌, మనీ ఫార్వర్డ్‌, రూబ్రిక్స్‌, టర్మ్‌గ్రిడ్‌, ఉబర్‌ వంటి పలు అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడి విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయి.

దిగ్గజాలతో పాటు 131 అంకుర సంస్థలు మంచి వేతన ప్యాకేజీతో 199 మంది విద్యార్థులకు ఉద్యోగాలను ఆఫర్‌ చేశాయి. ప్లేస్‌మెంట్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు రావడం విశేషం. సంస్థకు చెందిన మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఉన్న మొత్తం 61 మంది ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. దీంతో ఆ విభాగంలో 100 శాతం ప్లేస్‌మెంట్‌ నమోదైంది.

ఐఐటీ మద్రాస్‌ చెప్పిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు లభించిన సగటు వార్షిక వేతనం రూ.21.48 లక్షలు. అత్యధికంగా ఓ విద్యార్థికి రూ.1.98 కోట్ల వార్షిక వేతనం దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని