IIT Madras: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల హవా.. 30మందికి రూ.కోటి ప్యాకేజీ!

ఐఐటీలో ప్లేస్‌మెంట్ల సీజన్‌ ప్రారంభమైంది. రికార్డు స్థాయి వేతన ప్యాకేజీలకు ఈ విద్యాసంస్థలు పెట్టింది పేరు. అందుకు అనుగుణంగానే ఈసారి కూడా చాలా మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు.

Published : 02 Dec 2022 21:45 IST

చెన్నై: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల హడావుడి మొదలైంది. సీజన్ ప్రారంభమైన తొలిరోజే (డిసెంబరు 1) రికార్డు స్థాయిలో విద్యార్థులను కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఐఐటీ మద్రాస్‌లో గత ఏడాదితో పోలిస్తే తొలిరోజు ప్లేస్‌మెంట్లు 10 శాతం పెరిగినట్లు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. ప్రీ-ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్స్‌తో కలిపి మొత్తం 445 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. 

ఐఐటీ మద్రాస్‌లో మొత్తం 25 మంది విద్యార్థులు రూ.1 కోటికి పైగా వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. నాలుగు అంతర్జాతీయ కంపెనీలు 15 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురికి రూ.4 కోట్లకు పైగా ప్యాకేజీ లభించినట్లు ప్రముఖ పత్రిక ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పేర్కొంది.  జేన్‌ స్ట్రీట్‌, రూబ్రిక్‌, కొహెస్టీ, ఆప్టీవర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఐఐటీ రూర్కీలోనూ ఆరు అంతర్జాతీయ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా రూ.1.06 కోట్లు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఐఐటీ గువాహటిలోనూ 139 మంది ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ అత్యధికంగా రూ.2.4 కోట్లతో ఓ విద్యార్థి అంతర్జాతీయ కంపెనీ నుంచి ఆఫర్‌ కొట్టేసినట్లు సమాచారం. ఈ సంస్థలో మొత్తం 5 మంది రూ.కోటికి పైగా వార్షిక వేతన ప్యాకేజీ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని