Airindia New CEO: ఎయిరిండియా కొత్త సీఈవోగా ఇల్కర్‌

టాటాల చేతికి ఎయిరిండియా వచ్చాక ఆ సంస్థకు కొత్త సీఈవో ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. టర్కీస్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌....

Published : 14 Feb 2022 18:49 IST

దిల్లీ: టాటాల చేతికి ఎయిరిండియా వచ్చాక ఆ సంస్థకు కొత్త సీఈవో ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీని కొత్త ఎండీ, సీఈవోగా టాటాసన్స్‌ నియమించింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌  ఛైర్మన్‌ అలెక్స్‌ క్రూజ్‌ వంటి వారిపేర్లు కూడా వినిపించినప్పటికీ చివరకు ఇల్కర్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ టాటా సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇల్కర్‌ నియామకంపై ప్రకటన చేసిన సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. ఆయన్ను విమాన పరిశ్రమకు సారథిగా అభివర్ణించారు. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ను విజయవంతంగా నడిపించారని ప్రశంసించారు. ఎయిరిండియాను నవ శకం దిశగా నడిపించేందుకు టాటా గ్రూపులోకి ఇల్కర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

1971లో ఇస్తాంబుల్‌లో జన్మించిన ఇల్కర్‌ ఐసీ గతంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకముందు ఆ సంస్థ బోర్డులోనూ ఉన్నారు. 1994లో బిల్కెంట్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పూర్వ విద్యార్థి అయిన ఇల్కర్‌.. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో రీసెర్చర్‌గానూ పనిచేశారు. అలాగే, మర్మారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపైనా మాస్టర్స్‌ చేశారు. ఎయిరిండియా కొత్త సీఈవోగా ఏప్రిల్‌ 1 లేదా అంతకన్నా ముందే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని