Air India: టాటా ఎయిరిండియా సీఈఓ ఆఫర్‌.. తిరస్కరించిన ఇల్కర్‌ ఐసీ

ఎయిరిండియా నూతన సీఈఓ, ఎండీగా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీని టాటా సన్స్‌ను ఇటీవల నియమించింది. అయితే ఈ ఆఫర్‌ను ఇల్కర్‌ తిరస్కరించినట్లు

Published : 01 Mar 2022 15:54 IST

దిల్లీ: ఎయిరిండియా నూతన సీఈఓ, ఎండీగా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీని టాటా సన్స్‌ ఇటీవల నియమించింది. అయితే ఈ ఆఫర్‌ను ఇల్కర్‌ తిరస్కరించినట్లు విమానయాన పరిశ్రమ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇల్కర్‌ నియామకంపై భారత్‌లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎయిరిండియా బాధ్యతలు తీసుకోలేనని చెప్పినట్లు సమాచారం. 

ఎయిరిండియా సీఈవో, ఎండీగా ఇల్కర్‌ ఐసీని నియమిస్తున్నట్లు టాటా సన్స్‌ ఫిబ్రవరి 14న ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇల్కర్‌కు గతంలో టర్కీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న కారణంగా.. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించకూడదని వారు సూచించారు. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల టాటా ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖర్‌తో ఇల్కర్‌ భేటీ అయ్యారు. 

‘‘ఓ వ్యాపార నాయకుడిగా వృతిపరంగా ఉన్నత విలువలకే నేను అధిక ప్రాధాన్యమిస్తాను. అయితే భారత్‌లోని కొన్ని మీడియా సంస్థల్లో నా గురించి వస్తోన్న వార్తల నేపథ్యంలో నేను ఈ బాధ్యతలను అంగీకరించడం గౌరవప్రదం కాదనే నిర్ణయానికి వచ్చాను’’ అని టాటా ఛైర్మన్‌కు చెప్పినట్లు ఇల్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని టాటా సంస్థ కూడా ధ్రువీకరించింది. 

1971లో ఇస్తాంబుల్‌లో జన్మించిన ఇల్కర్‌ ఐసీ గతంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకముందు ఆ సంస్థ బోర్డులోనూ ఉన్నారు. బిల్కెంట్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పూర్వ విద్యార్థి అయిన ఇల్కర్‌.. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో రీసెర్చర్‌గానూ పనిచేశారు. అలాగే, మర్మారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపైనా మాస్టర్స్‌ చేశారు. టర్కీ అధ్యక్షుడు తైపీ ఎర్డోగాన్‌ 1994లో ఇస్తాంబుల్‌ మేయర్‌గా ఉన్నప్పుడు ఆయనకు ఇల్కర్ అడ్వైజర్‌గా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని