Sri Lanka Crisis: ఆసియాలో ఆ పరిధిలోకి వెళ్లిన తొలి దేశం శ్రీలంక!

Sri Lanka Crisis: ‘ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (EFF)’ కింద 48 నెలల పాటు మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని శ్రీలంకకు ఐఎంఎఫ్‌ అందించనుంది.

Published : 21 Mar 2023 17:12 IST

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka)కు అందించేందుకు మూడు బిలియన్‌ డాలర్ల బెయిలవుట్‌ ప్రోగ్రాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆమోదం తెలిపింది. ఆర్థిక కష్టాలను అధిగమించడంతో పాటు అభివృద్ధి పథకాలను అమలు చేయడం కోసం వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఐఎంఎఫ్‌ ప్యాకేజీని శ్రీలంక స్వాగతించింది. దీన్ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది.

‘ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (EFF)’ కింద 48 నెలల పాటు ఈ మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని శ్రీలంకకు ఐఎంఎఫ్‌ అందించనుంది. ‘స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (SDR)’ పేరిట ఐఎంఎఫ్‌ నిర్వహించే ప్రత్యేక విదేశీ మారకపు ఆస్తుల నుంచి వీటిని శ్రీలంక వినియోగించుకోనుంది. ఈఎఫ్‌ఎఫ్‌ మద్దతుతో అందిస్తున్న ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా శ్రీలంక స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించనున్నట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది. తద్వారా పేద, బడుగు వర్గాల ఆర్థిక కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తక్షణ సాయం కింద 254 మిలియన్‌ డాలర్లు శ్రీలంకకు అందనున్నాయి.

ఈ బెయిలవుట్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఎంఎఫ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకను ‘గవర్నెన్స్‌ డయాగ్నోస్టిక్‌ ఎక్సర్‌సైజ్‌’ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఆసియాలో ఒక దేశాన్ని ఈ పరిధిలోకి తీసుకురావడం ఇదే తొలిసారని పేర్కొంది. అంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పాలనాపరమైన లోపాలు, అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించేందుకు ఐఎంఎఫ్‌ స్వయంగా సమీక్ష నిర్వహిస్తుంది. దాని ఆధారంగా పలు సంస్కరణలను శ్రీలంకకు సిఫార్సు చేస్తుంది. ఈఎఫ్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం.. వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా అవినీతి తగ్గడంతో పాటు ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుందని ఐఎంఎఫ్‌ సీనియర్‌ అధికారి పీటర్‌ బ్రూయర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని