Global Economy: మున్ముందు మరిన్ని కష్టాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ ఆందోళన

IMF Expresses Concern over Global Economy: ఇప్పటికే తీవ్ర గడ్డు పరస్థితులు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది......

Published : 20 Jul 2022 14:57 IST

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2022 చాలా కఠినంగా గడవనుందని తెలిపింది. 2023 అంతకంటే దారుణంగా ఉండనున్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జియేవా ‘ఫేసింగ్‌ ఏ డార్కెనింగ్‌ ఎకానమిక్‌ ఔట్‌లుక్‌: హౌ ది జీ20 కెన్‌ రెస్పాండ్‌’ పేరిట ఓ వ్యాసం రాశారు. కొవిడ్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పెరుగుతోందని వివరించారు.

ధరలే పెద్ద భారం..

ద్రవ్యోల్బణంపై క్రిస్టలినా తన వ్యాసంలో ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదల మరింత విపరీతమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనున్నట్లు వివరించారు. ఈ ఏడాది అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం 5.7 శాతంగా, వర్ధమాన దేశాల్లో 8.7 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేశారు. కొవిడ్‌ తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ధరల పెరుగుదల పెద్ద అడ్డంకిగా మారినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు దేశాలు తమ శక్తి మేరకు ప్రయత్నించాలని సూచించారు. అలాగే కేంద్ర బ్యాంకులు పరపతి విధానాలను కఠినతం చేయాలని కోరారు. తక్షణమే స్పందించకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.

వృద్ధికి విఘాతం..

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే సమయంలో ఆర్థిక వృద్ధి దెబ్బతినక తప్పదన్న విషయాన్ని క్రిస్టలినా గుర్తుచేశారు. 2022, 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 3.6 శాతానికి కుంగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు వృద్ధి మరింత ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఇప్పటికే వృద్ధిరేటు బలహీనమైనట్లు వెల్లడించారు. భవిష్యత్తు అంచనాలు మరింత అస్థిరంగా మారాయని పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక భాగస్వామి అయిన చైనా పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని క్రిస్టలినా తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న మందగమనం రానున్న నెలల్లో మరింత తీవ్రంగా మారనున్నట్లు అంచనా వేశారు. చైనా సహా జీ-20 దేశాల వృద్ధిరేటు మందగిస్తే అది  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.

శ్రీలంక హెచ్చరిక..

ధరల్ని కట్టడి చేయడంతో పాటు రుణాలు మరింత భారంగా మారకుండా ఉండే ఆర్థిక విధానాల్ని అవలంబించాలని ఐఎంఎఫ్‌ చీఫ్‌ సూచించారు. కఠిన పరపతి విధానాల వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. రుణ భారం పెరిగి విధానాల్లో పటిష్ఠ ప్రణాళికలులేని దేశాలకు శ్రీలంకే ఓ పెద్ద హెచ్చరిక అని తెలిపారు. దాదాపు మూడోవంతు దేశాల్లో ప్రభుత్వ బాండ్ల రాబడులు 10 శాతానికిపైకి చేరాయని గుర్తుచేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ముప్పును సూచిస్తోందని తెలిపారు.

ఆహారం కోసం సహకారం..

ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఆహార సరఫరా కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణాత్మక ధోరణుల్ని వీడి ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ దేశాలు ఎగుమతులపై విధిస్తున్న ఆంక్షలు హానికారకంగా మారతాయని.. దేశీయంగానూ ధరల స్థిరీకరణకు ఉపయోగపడవని వివరించారు. గోధుమలు, వాటి ఉత్పత్తులపై భారత్‌ విధించిన ఆంక్షల్ని ఈ సందర్భంగా క్రిస్టలినా గుర్తుచేశారు. మరికొన్ని దేశాలూ ఇదే బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. 94.1 శాతం అల్పాదాయ దేశాలు, 88.9 శాతం దిగువ మధ్యాదాయ దేశాలు, 87 శాతం ఎగువ మధ్యాదాయ దేశాలు, 66 శాతం అధిక ఆదాయ దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఐదు శాతం కంటే ఎక్కువే ఉందని గుర్తుచేశారు..

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని