పీఎల్‌ఐ ఎఫెక్ట్‌.. చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులు తగ్గాయ్‌!

Imports from china: చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. పీఎల్‌ఐ పథకం ఇందుకు దోహదం చేసిందని ఓ నివేదిక తెలిపింది.

Published : 17 May 2023 01:34 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు అనగానే గుర్తుచ్చేది చైనానే. మన దేశంలోకి ఈ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుంటాయి. చైనా నుంచి మన దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువుల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాలదే ప్రధాన వాటా. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి చైనా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, ఇండిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, సోలార్‌ సెల్స్‌ దిగుమతులు తగ్గాయి. ప్రొడక్ట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ (PLI) పథకం అందుబాటులోకి వచ్చిన వేళ దిగుమతులు క్షీణించాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ (GTRI) సంస్థ తెలిపింది. వైద్య పరికరాల దిగుమతులు సైతం తగ్గుముఖం పట్టగా.. మొత్తం దిగుమతులు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు పేర్కొంది. 

  • 2021-22తో పోలిస్తే 2022-23లో చైనా నుంచి దిగుమతైన వైద్య పరికరాల విలువ 13.6 శాతం క్షీణించి 2.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
  • సోలార్‌ సెల్స్‌, డయోడ్ల దిగుమతులు సైతం 70.9 శాతం క్షీణించాయి. మొత్ం 1.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి.
  • ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 23.1 శాతం మేర క్షీణించాయి. వీటి విలువ 4.1 బి.డాలర్లు.
  • మొబైల్‌ ఫోన్ల దిగుమతులు సైతం 4.1 శాతం క్షీణించి 857 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
  • ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ల దిగుమతులు సైతం 4.5 శాతం క్షీణించాయి. వీటి విలువ 4.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
  • యూరియా ఇతర ఎరువుల దిగుమతులు సైతం 26 శాతం క్షీణించాయి. వీటి విలువ 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

లిథియం ఐయాన్‌ బ్యాటరీ దిగుమతులు మాత్రం అమాంతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 96 శాతం పెరిగి మొత్తం 2.2 బిలియన్‌ డాలర్ల విలవైన బ్యాటరీలు భారత్‌లోకి వచ్చాయి. దేశీయంగా ఈవీలకు ఆదరణ పెరుగుతుండడమే ఇందుకు కారణం. ‘‘చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22లో 30.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2022-23లో 27.6 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో చైనా నుంచి మొత్తం దిగుమతులు 4.2 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ దిగుమతుల వృద్ధి (16.1 శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ’’ అని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. చైనా నుంచి సరకుల దిగుమతులు సైతం 16.4 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గినట్లు వివరించారు. ముఖ్యంగా పీఎల్‌ఐ పథకం ఎలక్ట్రానిక్‌ దిగుమతులు తగ్గడానికి దోహదం చేసినట్లు శ్రీవాస్తవ తెలిపారు.

కొన్ని కేటగిరీ వస్తువుల దిగుమతులు తగ్గినప్పటికీ.. ఇప్పటికీ చైనా నుంచి భారత్‌ వివిధ రకాల వస్తువులను భారీగా దిగుమతి చేసుకుంటోందని నివేదిక తెలిపింది. 2021-22లో చైనా దిగుమతుల మొత్తం విలువ 94.6 బి.డాలర్లు ఉండగా.. 2022-23లో ఆ మొత్తం 91 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌ ఎగుమతుల విషయానికొస్తే.. అత్యధికంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్‌కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు స్వల్పంగా ఎగుమతులు పెరుగుతుండగా.. చైనా విషయంలో మాత్రం ఎగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. వీటి విలువ 13.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని