Insurance:  బీమాలో ప్ర‌పోజ‌ల్ ఫారం ప్రాముఖ్య‌త ఏంటి? 

బీమా తీసుకున్న వ్య‌క్తి స్వ‌యంగా ప్రాపోజ‌ల్ ఫారంని నింప‌డం వ‌ల్ల‌ త‌ప్పులు లేకుండా చూసుకోవ‌చ్చు. 

Updated : 10 Jan 2022 17:12 IST


బీమా పాల‌సీని తీసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నాక మొద‌టి చేయ‌వ‌ల‌సింది ప్ర‌పోజ‌ల్ ఫారంను (ప్ర‌తిపాద‌న ప‌త్రం) పూరించ‌డం. ప్ర‌పోజ‌ల్ ఫారం అంటే బీమా కంపెనీ మీ గురించి అవ‌స‌ర‌మైన‌ స‌మాచారాన్ని తెలుసుకునేందుకు తోడ్ప‌డే లీగ‌ల్ డాక్యుమెంట్‌. ఇందులో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి పేరు, వ‌య‌సు, జెండ‌ర్‌, చిరునామా వంటి నిర్థిష్ట స‌మాచారం తెల‌పాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆ పాల‌సీ తీసుకునేందుకు అర్హ‌త స‌రిపోతుందో లేదో తెలుస్తుంది. 

జీవిత బీమా అయితే ప్ర‌పోజ‌ల్ ఫారంలో వ‌య‌సు, ఆదాయం, వృత్తి వంటివి తెలియ‌జేయాలి. వ్య‌క్తి వ‌య‌సును ఆధారంగా ప్రీమియంను, ఆదాయాన్ని బ‌ట్టి పాల‌సీ ఎంత మొత్తానికి కొనుగోలు చేయ‌వ‌చ్చో అంచ‌నా వేస్తారు. ఈ రెండు ప్ర‌పోజ‌ల్ ఫారంలో ఉంటాయి.  దీంతో పాటు ఆరోగ్య స్థితిని తెలియ‌జేసేందుకు మెడిక‌ల్ హిస్ట‌రీని కూడా చేర్చాల్సి ఉంటుంది. ఏదైనా వ్యాదులు ఉంటే సంస్థ‌కు రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. మీరు ఎంచుకున్న పాల‌సీ ఆధారంగా ఆరోగ్య ప‌రిక్ష‌లు చేసుకోవాల్సి రావ‌చ్చు. అదేవిధంగా నామినీ వివ‌రాలు కూడా త‌ప్ప‌నిస‌రిగా జ‌త‌ చేయాలి.

ఇత‌ర పాల‌సీల వివ‌రాలు కూడా ప్ర‌పోజ‌ల్ ఫారం అడుగుతుంది. అంటే పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రంగా తెలుసుకునేందుకు ప్ర‌పోజ‌ల్ ఫారం తోడ్ప‌డుతుంది. అలాగే మీకు సంబంధించిన వివ‌రాల‌లో త‌ప్పులు లేకుండా ఇవ్వ‌చ్చు.  పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి పేరు, వ‌య‌సు వంటి ప్రాథ‌మిక‌ స‌మాచారంలో చిన్న చిన్న త‌ప్పులు, పొర‌పాట్లు చేస్తే క్లెయిమ్ స‌మ‌యంలో ప్ర‌భావం చూప‌వ‌చ్చు. పాలసీదారుడే స్వ‌యంగా ప్రపోజ‌ల్ ఫారం నింప‌డం వ‌ల్ల‌ ఇటువంటి త‌ప్పులు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు. అందుకే స్వ‌యంగా ప్ర‌పోజ‌ల్ ఫారం పూర్తిచేయ‌మంటారు నిపుణ‌లు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని