Health Insurance: మీ ఆరోగ్య బీమా పాలసీ మంచిదేనా?ఎలా నిర్ధారించుకోవాలి?

Health Insurance: ప్రతిఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండడం చాలా అవసరం. దేశంలో చాలా సంస్థలు చాలా రకాల పాలసీలు అందిస్తున్నాయి. మరి వీటిలో ఏది మంచి పాలసీయో నిర్ణయించుకోవడం ఎలా?

Updated : 17 Apr 2023 13:04 IST

Health Insurance | ఇంటర్నెట్‌ డెస్క్‌: అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) ఉపయోగపడుతుంది. ఏటా ప్రీమియం చెల్లిస్తే.. ఆసుపత్రి, ఓపీడీ, అంబులెన్స్‌ సహా ఇతరత్రా ఖర్చులు బీమా హామీలోనే కవర్‌ అవుతాయి. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు సెక్షన్‌ 80డీ ప్రకారం పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

అత్యవసర సమయాల్లో ఖరీదైన చికిత్సలకు సైతం ఆరోగ్య బీమా (Health Insurance) ఉపయోగపడుతుంది. ఖర్చు గురించి ఆలోచించకుండా సకాలంలో మెరుగైన చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ఒత్తిడి లేకుండా త్వరగా కోలుకోవడానికి కూడా పరోక్షంగా సాయపడుతుంది. ఒక్కరు అనారోగ్యం బారినపడ్డా.. కుటుంబం మొత్తం ఆర్థిక కష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరికీ సరిపడా ఆరోగ్య బీమా ఉండడం చాలా ముఖ్యం.

ఈ మధ్య హృద్రోగ, శ్వాస సంబంధిత సమస్యలు దేశంలో ఎక్కువవుతున్నాయి. వీటి చికిత్సకు చాలా ఖర్చవుతుంటుంది. పేద, మధ్యాదాయ కుటుంబాలు ఈ ఖర్చు భరించడం చాలా కష్టం. మరోవైపు మనుషుల ఆయుర్దాయం పెరుగుతోంది. అయితే.. ఇదే సమయంలో అనారోగ్య సమస్యలు సైతం ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికీ ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీ ఉండడం చాలా అవసరం. దేశంలో చాలా సంస్థలు, చాలా రకాల పాలసీలు అందిస్తున్నాయి. మరి వీటిలో ఏది మంచి పాలసీయో నిర్ధారించుకోవడం ఎలా.. చూద్దాం..

ఒక ఆరోగ్య బీమా పాలసీ మంచిదేనా నిర్ణయించుకోవడానికి ఈ కింద తెలిపిన మూడు అంశాలు దోహదం చేస్తాయి...

ముందు నుంచి ఉన్న సమస్యల కవరేజీ..

గ్లోబల్‌ బర్డన్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 25 శాతం అకాల మరణాలు హృద్రోగ సంబంధిత సమస్యల వల్లే సంభవిస్తున్నాయి. అలాగే క్యాన్సర్‌, డయాబెటిస్‌, శ్వాససంబంధిత సమస్యలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తమ బీమా (Health Insurance) పాలసీలో ఆయా సమస్యలు కవర్‌ అయ్యేలా చూసుకోవాలి. వీటికి వెంటనే బీమా రాకపోయినప్పటికీ.. ఒక నిర్దారిత ‘వేచి ఉండే సమయం (Waiting Period)’ ముగిసిన తర్వాత బీమా పాలసీ వర్తిస్తుంది. కాబట్టి కచ్చితంగా మీరు తీసుకోబోయే బీమా పాలసీలో ఇది ఉండేలా చూసుకోవాలి.

ప్రత్యామ్నాయ చికిత్స కవరేజీ..

సాధారణంగా ఆసుపత్రుల్లో ఇచ్చే చికిత్సలకు మాత్రమే ఆరోగ్య బీమా (Health Insurance) వర్తిస్తుంది. కానీ, కొన్ని మొండి వ్యాధులకు హోమియోపతి, ఆయుర్వేద వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు మెరుగైన ఫలితాలిచ్చే అవకాశం ఉంది. 2018లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో 82 శాతం మందిని దీర్ఘకాల సమస్యలే వేధిస్తున్నాయి. వీరిలో 76 శాతం మంది ఆయుర్వేదం వల్ల పాక్షిక లేదా పూర్తిస్థాయి ఉపశమనాన్ని పొందారు.

ఈ నేపథ్యంలో ఒక మంచి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలో ఆయుష్‌ (AYUSH) కింద ఉండే చికిత్సలన్నీ కవరై ఉండాలి. ఆయుర్వేద, యోగా- నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి చికిత్స మార్గాలను ఆయుష్‌గా వ్యవహరిస్తారు. ఇవన్నీ బీమా పాలసీలో ఉంటే ఎలాంటి చికిత్స తీసుకున్నా.. సమయానికి మన చేతికి డబ్బులు అందుతాయి.

ఎక్కవ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు..

భారత్‌లో చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికే మొగ్గు చూపుతారు. అందుబాటులో ఉండడం, నాణ్యమైన వైద్యం లభిస్తుందనే నమ్మకమే దీనికి కారణం. మరి ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో చికిత్స అంటే ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. ఈ నేపథ్యంలో బీమా పాలసీలో ఉండే నెట్‌వర్క్‌లో చాలా ఎక్కువ మొత్తంలో ఆసుపత్రులు ఉండాలి. అత్యవసర అనారోగ్య సమస్యలకు ఇది చాలా ముఖ్యం. సమయానికి మెరుగైన చికిత్స అందాలంటే ఎక్కువ ఆసుపత్రులు నెట్‌వర్క్‌లో ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని