ITR: పన్ను ఆదాకోసం చూస్తున్నారా.. అందుబాటులో ఉన్న పథకాలివే..

ప్రభుత్వం కొన్ని పథకాలకు ఆదాయపన్ను మినహాయింపులను అందజేస్తుంది. అలాంటి పథకాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.

Published : 30 Nov 2022 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నుల్లో మీ వార్షిక ఆదాయ సమాచారంతో పాటు మీరు ఫైల్‌ చేయాల్సిన పన్నులు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ సెక్షన్ల కింద, భారత ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు, మినహాయింపులను అనుమతించింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రజలను పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం.

పన్ను మినహాయింపు పథకాలు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద భారత ప్రభుత్వం కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపులను అనుమతిస్తుంది. మీరు ఈ స్కీమ్‌ల్లో పెట్టిన పెట్టుబడులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేయొచ్చు. అటువంటి కొన్ని పన్ను ఆదా పథకాలు కింద ఉన్నాయి..

  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(PPF)
  • ఉద్యోగుల భవిష్య నిధి(EPF)
  • ఈక్విటీ లింక్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ELSS)
  • నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(NPS)
  • సుకన్య సమృద్ధి యోజన(SSY)
  • సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(SCSS)
  • నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు(NSC)
  • జీవిత బీమా పాలసీ ప్రీమియంలు
  • 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల ఎఫ్‌డీలు
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు

పైన పేర్కొన్న పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయడమే కాకుండా, దీర్ఘకాలంలో మీ సంపదను కూడా వృద్ధి చేసుకోవచ్చు. ఆస్తి కొనుగోలుపై వర్తించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్‌పీఎస్‌లో సెక్షన్‌ 80సి ద్వారానే కాకుండా అదనంగా మరో రూ.50 వేలు మదుపు చేస్తే సెక్షన్‌ 80CCD 1(B) ద్వారా మినహాయింపు పొందే వీలుంది.

ఆరోగ్యబీమా

ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయడం కూడా పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80డి కింద, పన్ను చెల్లింపుదారుడు తనకు, జీవిత భాగస్వామికి, తనపై ఆధారపడిన పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లించడం ద్వారా రూ. 25,000 వరకు మినహాయింపును పొందవచ్చు. అదే సెక్షన్‌ కింద, సీనియర్‌ సిటిజన్‌ అయితే రూ. 50,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. మీరు 60 ఏళ్లు పైబడిన మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తే.. మరో రూ.50,000 వరకు మినహాయింపు క్లెయిమ్‌ చేయొచ్చు. కుటుంబం అంతటా సీనియర్‌ సిటిజన్లయితే రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది.

రుణంపై పన్ను ప్రయోజనాలు

గృహ రుణం: మీరు ఏదైనా బ్యాంక్‌ లేదా నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థ నుంచి గృహ రుణాన్ని తీసుకుంటే, మీ రుణంపై వడ్డీ, అసలు(ప్రిన్సిపల్‌) మొత్తానికి సంబంధించి మినహాయింపులను క్లెయిమ్‌ చేయడానికి అర్హత ఉంటుంది. గృహ రుణ వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 24 కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు, అసలుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపును అనుమతిస్తుంది.

విద్యా రుణం: సెక్షన్‌ 80E కింద విద్యా రుణానికి చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ మినహాయింపుపై పరిమితి లేదు.

నిర్దిష్ట పన్ను విధానాన్ని ఎంచుకోవాలి

ప్రస్తుత కాలంలో భారతీయ పౌరులకు 2 పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో మీరు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. కానీ గరిష్ఠ పన్ను ఆదా కోసం, తగిన పన్ను విధానాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొత్త పన్ను విధానం తక్కువ పన్ను స్లాబ్ రేట్లను ప్రతిపాదించింది. అయితే, ఇది పన్ను మినహాయింపులను అనుమతించదు. కాబట్టి, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపులను కోరుతున్నట్లయితే, మీరు పాత పన్ను విధానాన్ని అనుసరించడం మేలు. మినహాయింపులు తక్కువ ఉన్నా, అసలు లేకపోయినా మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

ఐటీఆర్‌ ఫైల్‌ చేసేటప్పుడు నిర్దేశిత సమయంలో చేయాలి. ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారు ప్రతి సంవత్సరం జులై 31 లేదా ఆదాయపు పన్నుశాఖ పేర్కొన్న తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. పేర్కొన్న వ్యవధిలో ఐటీఆర్‌ను ఫైల్‌ చేయడంలో విఫలమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

చివరిగా: చాలా మంది ఆదాయ పన్ను ఆదా చేసే ప్రయత్నంలో ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పెట్టుబడులు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదలు పెట్టడం మంచిది. మీరు తప్పనిసరిగా అన్ని పన్ను ఆదా పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవాలి. మీకు తగిన పథకాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని