Credit Score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? పెంచుకోవడమెలా..?

మొదటగా మీరు అందుబాటులో ఉన్న అధికారిక క్రెడిట్ బ్యూరోలలో ఒకదాని నుంచి క్రెడిట్ స్కోర్, రిపోర్ట్ ను పొందవలసి ఉంటుంది

Published : 24 Dec 2021 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో మీరు తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల ఆధారంగా మీ క్రెడిట్ స్కోర్ (How to improve credit score)ను లెక్కిస్తారు. మంచి క్రెడిట్ స్కోరు అనేది మంచి క్రెడిట్ ప్రవర్తనకు సూచనలాంటిది. క్రెడిట్ రిపోర్టు అనేది మీ క్రెడిట్ చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు క్రెడిట్ స్కోరును తెలుసుకోవాలనుకుంటే లేదా మీ క్రెడిట్ స్కోర్, రిపోర్ట్‌ను ఎలా విశ్లేషించాలో తెలియకపోతే మీకోసం కింద తెలియజేస్తున్నాం. మొదటగా మీరు అందుబాటులో ఉన్న అధికారిక క్రెడిట్ బ్యూరోల్లో ఒకదాని నుంచి క్రెడిట్ స్కోర్, రిపోర్ట్‌ను పొందాల్సి ఉంటుంది. అలా పొందిన క్రెడిట్ రిపోర్ట్‌ను కింద తెలిపిన మార్గాల ద్వారా అంచనా వేయొచ్చు.

* క్రెడిట్ స్కోర్ ప్రధానంగా మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. మీ రుణాలకు సంబంధించిన ఈఎంఐ చెల్లింపులు క్రెడిట్ నివేదికపై ప్రతిబింబిస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోండి. రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించడం మర్చిపోయి, డీఫాల్టర్‌గా మారకుండా ఉండడానికి, మీ ఈఎంఐలకు రిమైండర్‌ పెట్టుకోవడం మంచిది. ఇందుకోసం ‘ఆటో- డెబిట్’ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి రుణదాత ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే మీరు నిర్దిష్ట తేదీలోగా మీ ఖాతాలో నిధులను కలిగి ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. లేదంటే చెక్కు బౌన్స్ కారణంగా మీరు అదనంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.

* క్రెడిట్ కార్డుల వినియోగం మీ క్రెడిట్ స్కోరు హెచ్చుతగ్గుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను సమర్థంగా నిర్వహించడంలో మీ సామర్థ్యాన్ని చూపుతుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డులను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైనట్లయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

* మీరు రుణం లేదా క్రెడిట్ కార్డుల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసినట్లయితే, మీరు నిర్వహించే దాని కంటే ఎక్కువ క్రెడిట్‌ను పొందాలనుకునే వ్యక్తిగా మిమల్ని బ్యాంకు పరిగణిస్తుంది. అందువల్ల మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దానికి మీరు అర్హులా కాదా అనే విషయాన్ని తనిఖీ చేసుకోవడం మంచిది.

ఒకవేళ మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉన్నట్లయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పుడు మీరు అధికారిక క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, మీ క్రెడిట్ నివేదికల్లో ఉన్న లోపాలను వారికి వివరించి వాటిని సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలోని వివరాలు, ఖాతా బ్యాలెన్స్ వంటి తప్పుడు సమాచారం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ కలిగి ఉండకుండా, రుణాలు కూడా తీసుకోకుండా ఉన్నట్టయితే మీకు క్రెడిట్ స్కోర్ కూడా తగినంత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డు తీసుకుని, వాటి బిల్లుల్ని సరైన సమయానికి చెల్లిస్తూ ఉండాలి. తద్వారా క్రెడిట్ స్కోర్ కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని