Budget 2023: బడ్జెట్‌లో గ్రీన్‌ గ్రోత్‌: ఆరోగ్యం, అభివృద్ధికి.. ‘హరిత’ అమృతం..!

Green Growth: ఈసారి బడ్జెట్‌లో కేంద్రం పర్యావరణ హితమైన చొరవను చూపింది. గ్రీన్‌ గ్రోత్‌ సాధించే దిశగా పలు చర్యలను ప్రకటించింది.

Published : 01 Feb 2023 18:57 IST

దిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో వాతావరణ మార్పులే అతిపెద్ద సమస్య కాబోతున్నాయని అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. భారత ప్రభుత్వం తన బడ్జెట్‌లో గ్రీన్‌ గ్రోత్‌ (హరితవృద్ధి)కి (Green Growth) పెద్ద పీట వేసింది. 2070కి శూన్య ఉద్గారాలకు చేరాలని విధించుకున్న లక్ష్యాన్ని సాధించేదిశగా చొరవ చూపింది. పర్యావరణ హితమైన దిశగా చర్యలు ప్రకటించింది. సప్తర్షి రీతిన మన బడ్జెట్ (Budget 2023) అంటూ ప్రకటించిన ఏడు ప్రాధాన్యాంశాల్లో ఈ గ్రీన్‌ గ్రోత్‌ కూడా ఒకటి. 

* గ్రీన్‌ హైడ్రోజన్‌: ఇటీవల ప్రారంభించిన గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,700 కోట్లు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థను కర్బన రహితంగా మార్చేందుకు, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ మిషన్ కింద 2030 నాటికి ఏడాదికి 500 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. 

ఇంధన పరివర్తన, శూన్య ఉద్గారాల లక్ష్యాల సాధన, ఇంధన భద్రత కోసం మూలధన పెట్టుబడి కింద ఈ బడ్జెట్‌లో రూ.35వేల కోట్ల కేటాయింపులు చేపట్టారు.

అలాగే 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ నిల్వల వ్యవస్థ కోసం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌(VGF)ను ప్రకటించింది. VGF అంటే.. ఏదైనా ప్రాజెక్టు ఆర్థికంగా భారంగా మారకుండా ఉండేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే గ్రాంట్‌ లేక సబ్సిడీ లేక వాటాలు.

* పునరుత్పాదక ఇంధన తరలింపు, గ్రిడ్‌ ఇంటిగ్రేషన్ కోసం అంతరాష్ట్ర ప్రసార వ్యవస్థను నిర్మించేందుకు రూ.20,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. అందులో కేంద్రం సాయం రూ.8,300 కోట్లు. ఈ గ్రిడ్‌ను లద్దాఖ్‌లో నిర్మించతలపెట్టారు. 

గ్రీన్‌ క్రెడిట్ ప్రొగ్రాం: ప్రకృతి విషయంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించేందుకు గ్రీన్‌ క్రెడిట్‌ కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులు, స్థానిక సంస్థల పర్యావరణ హితమైన చర్యలను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. పర్యావరణ స్థిరత్వం కోసం పాటుపడేవారికి అదనపు వనరులు సమీకరించడంలో సహకరిస్తామన్నారు. 

మన ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు పాత కాలుష్య వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన వాహనాల తుక్కు విధానం గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు ఈ అంశంలో సహకారం అందిస్తామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని