Moonlighting: మూన్‌లైటింగ్‌ చేస్తున్నారా? పన్నులు తప్పవు మరి!

మూన్‌లైటింగ్‌ చేస్తూ పొందే అదనపు ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కంపెనీకి తెలియకుండా చేసినా.. ఆదాయ పన్ను విభాగానికి మాత్రం వివరాలు తెలియకుండా ఉండవని చెబుతున్నారు.

Updated : 04 Nov 2022 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదనపు ఆదాయం కోసం ఐటీ రంగంలో కొంతమంది నిపుణులు మూన్‌లైటింగ్‌ (Moonlighting) చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో సంస్థకు ప్రాజెక్టులు చేసిపెడుతున్నారు. ఇలా చేస్తున్నవారు పన్ను (Income Tax) చెల్లించడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. 

అదనపు ఆదాయాన్ని కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నుల్లో (ITR) చూపించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఐటీ నోటీసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్‌, కన్సల్టెన్సీ, కాంట్రాక్ట్‌.. ఇలా ఎలాంటి ఉద్యోగమైనప్పటికీ అది ఆదాయ పన్ను (Income Tax) విభాగానికి తెలియకుండా ఉండదని చెబుతున్నారు. మూన్‌లైటర్లకు కంపెనీలు వేతనం లేదా ప్రొఫెషనల్‌ ఫీజు రూపంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండూ ఆదాయ పన్ను (Income Tax) రికార్డుల్లో నమోదవుతాయి. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 194సీ ప్రకారం.. రూ.30 వేల కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలకు నిర్దేశిత రేటు వద్ద ‘మూలం వద్ద పన్ను (TDS)’ వర్తిస్తుంది. లేదా ఒక ఏడాదిలో చెల్లించే మొత్తం రూ.1 లక్ష దాటినా టీడీఎస్‌ (TDS) కట్‌ అవుతుంది. లేదా జీఎస్టీ కింద ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ITC)’ క్లెయిం కోసమైనా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఈ రెండు సందర్భాల్లో ఆ లావాదేవీలు ఐటీ రికార్డుల్లో నమోదవుతాయి. మరోవైపు ప్రతి కంపెనీ తమ చెల్లింపుల వివరాలను డిసెంబరు లేదా జనవరిలో కచ్చితంగా ఐటీ విభాగానికి సమర్పిస్తాయి. కాబట్టి మూన్‌లైటర్లు పొందే ఆదాయాన్ని దాచిపెట్టేందుకు ఎక్కడా ఆస్కారం ఉండదు. 

ఒకసారి కంపెనీలు తమ చెల్లింపులను టీడీఎస్‌ (TDS) లేదా ఐటీసీ కింద రికార్డు చేశాయంటే.. ఆ మొత్తం పొందినవారి 26ఏఎస్‌ ఫారంలో ఆ లావాదేవీ వివరాలన్నీ కనపడతాయి. ఈ నేపథ్యంలో మూన్‌లైటర్లు పొందుతున్న అదనపు ఆదాయాన్ని దాయడానికి అవకాశం ఉండదని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగులు కంపెనీ నుంచి ఫారం 16ను పొందాల్సి ఉంటుంది. ఇందులో వేతనం ద్వారా వచ్చిన ఆదాయం, దానిపై టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అయితే, ఉద్యోగి అదనపు పనిచేయడం ద్వారా పొందుతున్న ఆదాయం గురించి సంస్థకు తెలిసే అవకాశం లేదు. ఫారం 26ఏఎస్‌ చూస్తేగానీ ఆ విషయం వారికి తెలియదు. కాబట్టి కంపెనీకి దొరక్కుండా మూన్‌లైటింగ్‌ (Moonlighting) చేసినప్పటికీ.. పన్ను విభాగం నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు. 

సాధారణంగా ఐటీఆర్‌లో ఉద్యోగులు తమ ఆదాయాన్ని వేతనం, లాభాలు.. అనే రెండు కేటగిరీల కంద చూపించాల్సి ఉంటుంది. వేతనం కింద ప్రధాన కంపెనీ నుంచి పొందుతున్న ఆదాయాన్ని చూపించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరో ఉద్యోగం ద్వారా పొందుతున్న ఆర్జనను ఖర్చులన్నీ తీసేసి లాభాల కింద చూపించాలని సలహా ఇస్తున్నారు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగానికి అయ్యే ప్రతి ఖర్చును తీసేసి మిగిలిన మొత్తాన్ని ప్రొఫెషన్‌ ద్వారా పొందుతున్న లాభాల కింద పేర్కొనాలన్నమాట! ఒకవేళ ఇలా పొందుతున్న అదనపు ఆదాయం మొత్తం ఒక ఏడాదిలో రూ.20 లక్షలు దాటితే దానిపై జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని