Tax Calculator: ఐటీ పోర్టల్‌లో ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌.. ఎలా వాడాలి?

పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్లో పన్ను కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Updated : 21 Feb 2023 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను (Income tax) ఎంత చెల్లించాలో తెలియట్లేదా? పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటే లాభం చేకూరుతుందో లెక్కలు వేయడంలో గందరగోళానికి లోనవుతున్నారా? అయితే ఇక చింతించాల్సిన పనిలేదు. పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్‌లో పన్నుకాలిక్యులేటర్‌ను (Calculator) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీకు ఏ విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే, ఈ కాలిక్యుటర్‌ ఎక్కడ ఉంది? ఎలా ఉపయోగించాలి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాలిక్యులేటర్‌ ఎలా పనిచేస్తుంది?

బేసిక్‌ కాలిక్యులేటర్‌..

మీరు మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌), పన్ను చెల్లింపుదారుని కేటగిరీ (వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్‌, ఎల్‌ఎల్‌పి వంటివి), పన్ను చెల్లింపుదారుని వయసు (60 ఏళ్ల లోపు, సీనియర్‌ సిటిజన్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌), నివాస స్థితి వంటి వాటిని ఎంచుకుని.. మీ వార్షిక ఆదాయం, మొత్తం మినహాయింపులు తెలియజేస్తే, మీకు పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంత పన్ను పడుతుందో నేరుగా తెలియజేస్తుంది. అలాగే, ఏ విధానం ప్రయోజనకరమో కూడా తెలియజేస్తుంది. అయితే, ఇది త్వరితగతిన సులభంగా బేసిక్‌ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్‌..

  • చెల్లించాల్సిన పన్నును మరింత విపులంగా లెక్కించేందుకు అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్‌ ఉపయోగపడుతుంది. 
  • ఈ విధానంలో ముందుగా మీరు పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటున్నారో తెలియజేయాలి.
  • ఆ తర్వాత మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌), పన్ను చెల్లింపుదారుని కేటగిరి (వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్‌, ఎల్‌ఎల్‌పి వంటివి), పన్ను చెల్లింపుదారుని వయసు (60 ఏళ్ల లోపు, సీనియర్‌ సిటిజన్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌), నివాస స్థితి వంటి వాటిని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు 30 ఏళ్ల వయసున్న, జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగి అయితే పన్ను చెల్లింపుదారుని కేటగిరీలో ఇండివిడ్యువల్‌, వయసు 60 ఏళ్ల లోపు వంటి ఆప్షన్లను ఎంచుకోవాలి.
  • అలాగే, కింద అడిగిన వివరాలను ఇవ్వాలి. ముందుగా మీకు జీతం ద్వారా వచ్చే ఆదాయం ఎంటర్‌ చేయాలి. ఒకవేళ మీకు ఇంటి ద్వారా ఆదాయం, మూలధన ఆదాయం, ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే ఆయా కేటగిరీలో ‘ప్రొవైడ్‌ ఇనకమ్‌ డీటెయిల్స్‌’ పై క్లిక్‌ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి. 
  • ఇక ఆ తర్వాత మీరు చేసిన పన్ను ఆదా పెట్టుబడులు, ఇతర మినహాయింపులకు సంబంధించిన వివరాలు ‘డిడక్షన్‌’ కింద కనిపిస్తున్న ‘ప్రొవైడ్‌ ఇన్‌కమ్‌ డీటెయిల్స్‌’ పై క్లిక్‌ చేసి ఇవ్వాలి. 
  • కొత్త పన్ను విధానంలో డిడక్షన్లు వర్తించవు కాబట్టి సంబంధిత మొత్తాన్ని ఎంటర్‌ చేసే అవకాశం ఉండదు. పాత పన్ను విధానంలో మాత్రం కొన్ని సెక్షన్ల కింద మినహాయింపులు కనిపిస్తాయి. వాటిని నేరుగా ఎంటర్‌ చేయవచ్చు.
  • ఇవి కాకుండా మీకు ఇంకా మినహాయింపులు ఉంటే, కింద ‘ఎంటర్‌ డిడక్షన్‌’, ‘యాడ్‌ డిడక్షన్‌’ అని కనిపిస్తాయి. అక్కడ డిడక్షన్‌ వివరాలు ఎంటర్‌ చేసి వర్తించే పన్నును లెక్కించవచ్చు.

చివరిగా..

పన్ను చెల్లింపుదారులు.. వారి వారి ఆదాయం, మినహాయింపుల వంటి సమాచారం అందించి ఆదాయపు పన్ను విభాగం అందించే కాలిక్యులేటర్‌ ద్వారా స్వయంగా పన్ను లెక్కించవచ్చు. అలాగే, మీకు ఏ విధానం లాభదాయకమైతే ఆ విధానాన్ని ఎంచుకుని రిటర్నులు ఫైల్‌ చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని