Budget 2023: ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి ₹5 లక్షలకు పెంపు?

Budget 2023: వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఈ బడ్జెట్‌లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే పన్నుచెల్లింపుదారుల సుదీర్ఘకాల డిమాండ్‌ సాకారమైనట్లే.

Updated : 21 Jan 2023 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ ఈ సారి సాకరమయ్యే అవకాశం కనిపిస్తోంది. పన్ను మినహాయింపు పరిమితిని (Income tax exemption) రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే బడ్జెట్‌లో (Budget-2023) ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీనివల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిమితి పెంపు ద్వారా పెట్టుబడులను సైతం ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షల వార్షికాదాయంపై ఎలాంటి పన్నూ లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి 5 శాతం పన్ను వర్తిస్తోంది. 60-80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్‌ సిటిజన్లకు ఈ పన్ను పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. 80 ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్లకు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది.

60 ఏళ్లు లోపు ఉన్నవారికి ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. దీనిపై గత కొన్ని బడ్జెట్‌ల్లో నిరాశ ఎదురవుతూనే ఉంది. అయితే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మోదీ 2.0 ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదే అవుతుంది. దీంతో ఈ సారైనా తమ కల సాకారం కావొచ్చని పన్ను చెల్లింపుదారుల్లో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు ఎదురుచూడాల్సిందే!

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని