IT Exemption: ఏ పథకాలలో పెట్టుబడికి 80C వర్తిస్తుంది?

80సీ ద్వారా ఎలాంటి పథకాలలో పెట్టుబడి పెడితే మినహాయింపు పొందొచ్చొ చూద్దాం.

Published : 22 Dec 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గరిష్ఠంగా పన్నును ఆదా చేయడానికి కొన్ని కీలక పెట్టుబడి పథకాలు ఉన్నాయి. వీటికి 80సి వర్తిస్తుంది. సెక్షన్‌ 80సి ద్వారా రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాదు. ఈ పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాలికంగా ఉంటాయి. కాబట్టి, ఈ పెట్టుబడుల్లో మీ ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవాటిని ఎంచుకుంటే, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వాటిని సమర్థంగా ఉపయోగించొచ్చు. ఈ పెట్టుబడులు చేయడానికి ఆర్థిక సంవత్సరం చివరి వరకు చూడకుండా ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. దీంతో మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైల్‌ చేసే సమయంలో పెట్టుబడుల రశీదులు అన్నీ ఏ ఇబ్బందీ లేకుండా సమర్పించొచ్చు. పన్ను ప్రణాళిక అనేది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు ఏడాది పొడవునా ఉండే ప్రక్రియగా ఆదర్శంగా ఉండాలి.

మొదట సెక్షన్‌ 80సి పన్ను ఆదాలో ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి.. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌కు ఆర్థిక సంవత్సరంలో చేసిన కొన్ని పెట్టుబడులపై పన్ను విధించదగిన ఆదాయం నుంచి రూ.1.5 లక్షల తగ్గింపును అందిస్తుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపును క్లెయిమ్‌ చేయలేరు. ఈ 80సి ద్వారా పన్ను ఆదా పెట్టుబడులు వేటికి వర్తిస్తుందో, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ చూద్దాం.

ఈక్విటీ-లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌)

ఇవి మ్యూచువల్‌ ఫండ్ల పరిధిలోకి వస్తాయి. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల నుంచి అధిక రాబడిని పొందడం వంటి ప్రయోజనాలను అందించడానికి వీటిని రూపొందించారు. వీటిలో పెట్టుబడులకు 3 ఏళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇవి మార్కెట్ల ఆధారంగా పనిచేసేవి. వీటి ఆదాయం.. గత మార్కెట్ల పనితీరు ఆధారంగా సగటున 10-13% మధ్య ఉంది. కనీస పెట్టుబడి మారుతూ ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ) రూ.లక్ష వరకు పన్ను రహితం. డివిడెండ్‌ ఆదాయం మొత్తం ఆదాయంలో చేరుస్తారు. స్లాబ్‌ రేటులో పన్ను విధిస్తారు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

5 సంవత్సరాల బ్యాంకు ఎఫ్‌డీలు మాత్రమే సెక్షన్‌ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత ఉన్నాయి. ఈ డిపాజిట్లు చేయడానికి భారత పౌరులకు మాత్రమే అర్హత ఉంటుంది. రాబడి బ్యాంకులను బట్టి 6.5-7.5% వరకు ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. స్లాబ్‌ రేటులో సంపాదించిన వడ్డీపై ఆదాయపన్ను వర్తిస్తుంది.

పీపీఎఫ్‌

ఇది ప్రభుత్వ హామీ ఉన్న 15 సంవత్సరాల దీర్ఘకాల పెట్టుబడి. ఇందులో డిపాజిట్లకు భారత పౌరులకు మాత్రమే అనుమతి ఉంటుంది. లాక్‌-ఇన్‌-పీరియడ్‌ 15 సంవత్సరాలు అయినా ప్రతి 5 ఏళ్లకోసారి అపరిమితంగా పొడిగించుకోవచ్చు. అయితే 7 ఏళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతంగా ఉంది. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.500, గరిష్ఠ పెట్టుబడి రూ.1.5 లక్షలు. ఈ పెట్టుబడులను ఉపసంహరణ సమయంలో వచ్చిన అసలుకు, వడ్డీకి ఆదాయ పన్ను లేదు.

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)

పదవీ విరమణ నిధిని ఉద్దేశించి.. మీ ప్రాథమిక జీతం + డీఏలో 12% యజమాని కట్‌చేసి.. ఈపీఎఫ్‌ లేదా ఇతర గుర్తింపు పొందిన ప్రావిడెంట్‌ ఫండ్లలో జమ చేస్తారు. నెలకు గరిష్ఠంగా రూ.1,500. ఉద్యోగం నుంచి నిష్ర్కమించిన 2 నెలల తర్వాత వారు ఆ సమయంలో ఏ ఉద్యోగంలో చేరకపోతే వారి పీఎఫ్‌ నిల్వ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రాబడి 8.1%. ఐదేళ్ల  నిరంతర సర్వీసు తర్వాత ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ (వడ్డీతో సహా) ఉపసంహరించుకుంటే, మొత్తం ఈపీఎఫ్‌ మొత్తం పన్ను రహితంగా ఉంటుంది.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)

ఈ పథకంలో పెట్టుబడి పెడితే రూ.2 లక్షల వరకు పన్ను ఆదా మినహాయింపు లభిస్తుంది. ప్రధానంగా పనిచేసే నిపుణులు, అసంఘటిత రంగ పనివారు రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ ఆదాయాన్ని పొందడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే 80 సీసిడీ (1బీ) కింద అదనంగా రూ.50 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇందులో చేరడానికి కనీస, గరిష్ఠ వయసు 18-60 సంవత్సరాలు.

సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది. కనీసం 10 ఏళ్ళ వయసు గల అమ్మాయి ఉంటే.. వారి పేరు మీద ఖాతా తెరవొచ్చు. పాప వయసు 18 ఏళ్లు  దాటాక 50 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 7.60 శాతంగా ఉంది.  ఇందులో ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మదుపు చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు.

జీవిత బీమా

జీవిత బీమా పాలసీ ప్రీమియంపై కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, పాలసీ ప్రీమియం బీమా హామీలో 10 శాతానికి మించకూడదు.   

పిల్లల స్కూల్ ఫీజు

పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజుపై కూడా కొంత వరకు మినహాయింపు పొందే వీలుంటుంది. ఇద్దరు పిల్లల వరకు ఈ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 

ఇంటి రుణం

ఇంటి రుణం కోసం చెల్లించే ఈఎంఐ (అసలు)పై కూడా ఈ సెక్షన్ లో మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. ఇంటి కొనుగోలు సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర ఖర్చులపై కూడా మినహాయింపు అనుమతిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని