Union Budget: పన్ను రేట్లు, వికసిత్‌ భారత్‌, ఆర్థిక స్థిరత్వం.. కేంద్ర బడ్జెట్‌పై బ్రోకరేజీల అంచనాలు

Union Budget: రాబోయే కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారుల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ మదుపర్ల వరకు కేంద్ర పద్దు కోసం వేచిచూస్తున్నారు.

Updated : 11 Jul 2024 14:53 IST

Union Budget | ఇంటర్నెట్‌ డెస్క్‌: జులై 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టబోతోంది. వివిధ వర్గాలు తమ ఆశలు, ఆకాంక్షలను ఇప్పటికే కేంద్రానికి వివిధ మార్గాల్లో తెలియజేశాయి. పన్ను చెల్లింపుదారుల దగ్గరి నుంచి స్టాక్‌ మార్కెట్‌ మదుపర్ల వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోని అంశాలపై ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు బ్రేకరేజీ సంస్థలు సైతం తమ అంచనాలను వెల్లడించాయి. అవేంటో చూద్దాం..

ఆదాయ పన్ను విధానంలో మార్పులు: బీఓఎఫ్‌ఏ

ప్రజల వినిమయ శక్తిని పెంచేలా కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) పన్ను కోతలు ఉండొచ్చని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల (PLI) పథకం విస్తరణ, రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, అదనపు హెల్త్‌కేర్‌ కవర్‌ వంటి ప్రకటనలు ఉండొచ్చని ఆశిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 11 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

సున్నా ట్యాక్స్‌ శ్లాబు (Tax Slabs) పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచొచ్చని బీఓఎఫ్‌ఏ అంచనా వేసింది. అలాగే రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై పన్ను (Income Tax) భారం తగ్గించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. సెక్షన్‌ 80సీ మినహాయింపుల్లోనూ మార్పులు చేయొచ్చని తెలిపింది. మరిన్ని మెట్రోయేతర నగరాలకూ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అత్యంత రిస్క్‌తో కూడుకొన్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యాన్ని తగ్గించే దిశగానూ చర్యలు ఉండొచ్చని అంచనా వేసింది.

‘బడ్జెట్‌’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?

పన్ను రేట్లు యథాతథం: మోర్గాన్‌ స్టాన్లీ

తాత్కాలిక బడ్జెట్‌కు అనుగుణంగానే ఆర్థిక లోటును జీడీపీలో 5.1 శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించుకునే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. మూలధన వ్యయ (Capex) పెంపు ద్వారా ఉద్యోగ కల్పన, ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపింది. వ్యక్తిగత ఆదాయ పన్ను (Income Tax) రేట్లలో మాత్రం మార్పులు ఉండకపోవచ్చునని పేర్కొంది. మధ్యాదాయ వర్గాలకు మాత్రం కొన్ని రకాల పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది. వ్యవసాయం, అంకురాలు, రైల్వే, రక్షణ, ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, విద్యుత్తు వాహనాలు, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాలకు వర్తించే కీలక ప్రకటన ఉండొచ్చని తెలిపింది. స్వల్పకాల మూలధన లాభాల పన్నును 15 శాతం నుంచి పెంచే అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొంది.

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా..: గోల్డ్‌మన్‌ శాక్స్‌

కేవలం అంకెలు, కేటాయింపులకు పరిమితం కాకుండా 2047 నాటికి వికసిత్‌ భారత్ లక్ష్యంగా కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. గ్రామీణ ఆర్థికం, ఉద్యోగాల కల్పన, తయారీ రంగం, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు, నైపుణ్యాభివృద్ధి, సేవారంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపింది.

ప్రజాకర్షక పథకాలు ఉండకపోవచ్చు: నొమురా

ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లే సూచనలు కనిపించడం లేదని నొమురా తెలిపింది. మూలధన వ్యయం, ఆర్థిక స్థిరత్వంపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొంది. బడ్జెట్‌పై ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చునని తెలిపింది. స్థూల ఆర్థిక విధానాలను కొసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపొచ్చునని స్పష్టం చేసింది.

ఐదు శాతానికి కోశలోటు: మోతీలాల్‌ ఓస్వాల్‌

పన్ను శ్లాబులు, రేట్లలో మార్పు ప్రతిపాదనలు బడ్జెట్‌లో (Union Budget) పెద్దగా ఉండకపోవచ్చునని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. ఆర్‌బీఐ నుంచి పెద్ద ఎత్తున అందిన డివిడెండ్ల వల్ల ప్రభుత్వం రూ.1.1 లక్షల కోట్లు అదనంగా ఖర్చు చేసే వెసులుబాటు కలిగిందని గుర్తుచేసింది. మరోవైపు కోశ లోటును (Fiscal deficit) జీడీపీలో ఐదు శాతానికి తగ్గించొచ్చునని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని