EPF: ఈపీఎఫ్ ఉపసంహరణ పరిమితులు, పన్నులు

ఈపీఎఫ్ ఖాతా ఉపసంహరణపై పన్నులు ఎలా ఉంటాయో చూద్దాం.

Published : 19 Jan 2023 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈపీఎఫ్ఓ (EPFO) తమ నిబంధనలను ఖాతాదారుల సౌకర్యం మేరకు నిరంతరం సవరిస్తూనే ఉంటుంది. ఈపీఎఫ్ డబ్బు ఆన్‌లైన్‌ ద్వారా విత్‌డ్రా చేసుకుంటే నేరుగా తమ ఖాతాలో జమవుతుంది. అయితే, ఈపీఎఫ్ ఖాతాను పదవీ విరమణ వరకు కొనసాగించాలని ఆర్థిక నిపుణుల సూచన. పదవీ విరమణకు ముందే విత్‌డ్రా చేసుకోకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ముందస్తు ఉపసంహరణలపై పన్ను విధిస్తోంది.

ఈపీఎఫ్ ఉపసంహరణ పై పన్ను

కనీసం ఐదేళ్లు ఉద్యోగంలో కొనసాగకపోతే ఈపీఎఫ్ ఉపసంహరణ సమయంలో పన్ను వర్తిస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నప్పుడు ఈపీఎఫ్ ఖాతాను మరో సంస్థకు బదిలీ చేస్తే రెండు సంస్థల్లో కలిపి ఎంత కాలం కొనసాగారన్నది పరిగణిస్తారు. మొత్తం ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఖాతాను కొనసాగిస్తే, ఈపీఎఫ్‌ విత్‌డ్రాపై పన్ను ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలో నగదు మొత్తం నాలుగు రకాలుగా జమవుతుంది..సంస్థ వాటా, ఉద్యోగి వాటా, సంస్థ చేసిన డిపాజిట్లపై వడ్డీ, ఉద్యోగి డిపాజిట్లపై వడ్డీ. ఐదేళ్ల కంటే తక్కువగా ఖాతాను కొనసాగిస్తే సంస్థ డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు వడ్డీపై కూడా పన్ను పడుతుంది.

ఉద్యోగి వాటాపై ఉపసంహరణ సమయంలో పన్ను ఉండదు. అయితే, ఉపసంహరణకు ముందు సంవత్సరాల్లో ఎప్పుడైనా సెక్షన్ 80సీ కింద ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకుంటే విత్‌డ్రా సమయంలో పన్ను వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈపీఎఫ్ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉద్యోగి డిపాజిట్ మీద వచ్చిన వడ్డీని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. ఐదేళ్ల కంటే ముందు విత్‌డ్రా చేసుకుంటే 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఖాతాలో మొత్తం రూ.50 వేల కంటే తక్కువగా ఉన్నా లేదా సంస్థ మూసివేసినా టీడీఎస్ ఉండదు. ఖాతాలో మొత్తం రూ.50 వేల కంటే ఎక్కువగా ఉండి ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఉద్యోగంలో కొనసాగితే ఖాతాదారుడు ఫారం 15జీ/15హెచ్ సమర్పించి టీడీఎస్ మినహాయింపు పొందొచ్చు. అయితే, వార్షిక ఆదాయం పన్ను పరిమితికంటే  తక్కువగా ఉండాలి. ఫారం 15H సీనియర్ సిటిజన్ల కోసం కాగా, 60 ఏళ్ల లోపు వయసు గలవారు ఫారం 15G సమర్పించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని