Income Tax: సెక్ష‌న్ 80సీసీఎఫ్ గురించి విన్నారా?ఎంత మినహాయింపు పొందొచ్చు?

సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ల‌భించే రూ. 1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపుకు అద‌నంగా సెక్ష‌న్ 80సీసీఎఫ్‌తో  ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

Published : 24 Mar 2022 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి.. అక్క‌డి మౌలిక సదుపాయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. వేగవంతమైన వృద్ధి, ఆర్థిక పురోగతికి దారి తీస్తుంది. అయితే, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం. ఇందుకోసం ఎక్కువ శాతం నిధులు పన్ను చెల్లింపుదారుల నుంచి వ‌స్తుండ‌గా, మిగిలిన నిధుల‌ను స‌మ‌కూర్చేందుకు దేశ పౌరుల స‌హకారం చాలా అవ‌స‌రం. ఇందుకోస‌మే ప్ర‌భుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల‌ను విడుద‌ల చేస్తుంది. ఎక్కువ మంది పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షించేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీసీఎఫ్ (80ccf)  జోడించి ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తోంది. మ‌రోవైపు ప‌న్ను చెల్లింపుదారులు కూడా త‌మ ప‌న్ను భారాన్ని ఏవిధంగా త‌గ్గించుకోవ‌చ్చోన‌ని వివిధ ప‌న్ను ఆదా ప‌థ‌కాల గురించి అన్వేషిస్తుంటారు. అటువంటి వారు ఈ బాండ్లలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా కొంత వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా ప్ర‌భుత్వం, ప‌న్ను చెల్లింపుదారులు ఇరువురికీ ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

సెక్ష‌న్ 80సీసీఎఫ్.. సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ల‌భించే రూ.1.50 ల‌క్ష‌ల మిన‌హాయింపునకు అద‌నంగా 80సీసీఎఫ్‌ ద్వారా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. నిర్దిష్ట పథకాల్లో పెట్టుబడి చేసిన ప‌న్ను చెల్లింపుదారుల‌కు మాత్ర‌మే ఈ సెక్ష‌న్ కింద మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. దీన్ని 2010 బడ్జెట్‌లో రూపొందించగా, 2011 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 2011లో అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ కింద‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతర బాండ్లలో పెట్టిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 

ఎవ‌రు అర్హులు..?: సెక్ష‌న్ 80సీసీఎఫ్ కింద ల‌భించే ఈ మిన‌హాయింపు భార‌తీయ నివాసులైన వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఎన్నారైలు, విదేశీయుల‌కు ఈ మిన‌హాయింపు వ‌ర్తించ‌దు. సంస్థలు, సంఘాలకూ వర్తించదు. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదార‌లతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబాల వారికి కూడా సెక్ష‌న్ 80 సీసీఎఫ్ కింద ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అర్హ‌త ఉంటుంది.

ఉమ్మ‌డి పెట్టుబ‌డులు: ఒక‌వేళ ఉమ్మ‌డిగా పెట్టుబ‌డులు చేస్తే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు మాత్రం ఒక్క‌రికే ల‌భిస్తాయి. ప్రథమ పెట్టుబడి దారుడు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అలాగే, హిందూ అవిభాజ్య కుటుంబాల్లో ఒక స‌భ్యుడు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

వేటికి వ‌ర్తిస్తుంది?: ప్ర‌భుత్వ అనుమ‌తితో బ్యాంకులు, కార్పొరేష‌న్లు జారీ చేసే ప‌న్ను ఆదా బాండ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల‌లో చేసిన పెట్టుబ‌డుల‌కు మాత్ర‌మే సెక్ష‌న్ 80సీసీఎఫ్ వ‌ర్తిస్తుంది.

గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నం ఎంత‌?: సెక్ష‌న్ 80సీపీఎఫ్ కింద గ‌రిష్ఠంగా రూ.20 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. ఇంత‌కు మించి చేసిన పెట్టుబడులపై మినహాయింపు పొందే వీలుండదు.

ఎలా ప‌నిచేస్తుంది?: ఉదాహ‌ర‌ణ‌కు ర‌మేష్‌కి 30ఏళ్లు. వార్షిక వేత‌నం రూ.5.50 ల‌క్ష‌లు. ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం రూ.2.50 ల‌క్ష‌ల‌కు మించిన ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ.3 ల‌క్ష‌ల‌కు ర‌మేష్ ప‌న్ను చెల్లించాలి. ప‌న్ను భారాన్ని త‌గ్గించుకునేందుకు సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు అందించే వివిధ ప‌థ‌కాల్లో రూ.1.50 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెట్టాడు. ఇంకా ప‌న్ను వ‌ర్తించే ఆదాయం రూ.1.50 ల‌క్ష‌లు (రూ.3 ల‌క్ష‌లు - రూ.1.50ల‌క్షలు) ఉంది. మ‌రింత ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అత‌డు ప్ర‌ముఖ బ్యాంక్ అందించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల‌లో రూ.40 వేలు పెట్టుబ‌డి పెట్టాడు. ఇప్పుడు అత‌డు సెక్ష‌న్ 80సీసీఎఫ్ ప్ర‌కారం మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అత‌డు ఈ బాండ్ల‌లో రూ.40 వేలు పెట్టుబ‌డి పెట్టిన‌ప్ప‌టికీ రూ.20 వేల వరకు మాత్ర‌మే మిన‌హాయింపు పొందేందుకు వీలుంటుంది. అంటే ర‌మేష్ ఇంకా రూ.1.30 ల‌క్ష‌ల (రూ.1.50 ల‌క్ష‌లు - రూ.20వేలు) పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

మిన‌హాయింపు పొందేందుకు ఇవ్వాల్సిన ప‌త్రాలు..

  • పాన్ వివరాలు
  • ప్రభుత్వం ఆమోదించిన ఐడీ ఫ్రూఫ్‌
  • బ్యాంక్ వివరాలు (అవసరమైతే)
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీఎఫ్‌ వర్తింపు పెట్టుబ‌డి ప‌త్రాలు

గుర్తుంచుకోండి: ప‌న్ను ఆదా బాండ్ల‌లో వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. కాబ‌ట్టి వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను చెల్లించాలి. ఈ విధ‌మైన బాండ్లు దీర్ఘ‌కాల ప‌రిమితుల‌తో వ‌స్తాయి. వీటి కాల పరిమితి 5 సంవ‌త్స‌రాలకి పైబడి ఉంటుంది. సాధారణంగా 5 ఏళ్ల వరకు లాక్ ఇన్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మాత్ర‌మే విక్ర‌యించేందుకు వీలుంటుంది. వేరు వేరు బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్ప‌టికీ.. అన్ని బాండ్ల‌పై సంవ‌త్స‌రానికి రూ.20 వేల వ‌ర‌కు మాత్ర‌మే క్లెయిమ్ చేయ‌గ‌ల‌రు. మైన‌ర్ల పేరుపై పెట్టుబ‌డులకు ఇది వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని