Home loan: గృహ రుణం తీసుకున్నారా? ఎంత వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

మీరు రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసే వుంటే ప్ర‌తీ నెల చెల్లించే.. ఈఎమ్ఐలో అస‌లు, వ‌డ్డీ రెండిటిపైనా వేరు వేరు సెక్ష‌న్ల కింద ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

Published : 23 Jul 2022 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతిల్లు ఉండాల‌నేది దాదాపు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. భార‌త ప్ర‌భుత్వం ఇల్లు కొనుగోలుదారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద కొన్ని మిన‌హాయింపుల‌ను అందిస్తోంది. ఒక‌వేళ మీరు కూడా రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి ఉంటే.. పాత ప‌న్ను విధానం ద్వారా రిట‌ర్నులు ఫైల్ చేస్తుంటే.. కొన్ని మిన‌హాయింపుల‌ను పొందొచ్చు. రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసిన వారు ప్ర‌తి నెలా చెల్లించే ఈఎంఐలో అస‌లు, వ‌డ్డీ రెండింటిపైనా వేరు వేరు సెక్ష‌న్ల కింద మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అందువ‌ల్ల ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ప‌న్ను చెల్లింపుదారులు రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు గానూ బ్యాంకు నుంచి ఈఎంఐల అస‌లు, వ‌డ్డీల‌ను తెలిపే ప‌త్రాలను తీసుకోవాలి.

అస‌లుపై: గృహ రుణం కోసం చెల్లించే అస‌లు మొత్తంపై ప‌న్ను చెల్లింపుదారులు సెక్ష‌న్ 80సి కింద రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. అయితే ఇక్క‌డ ఒక ముఖ్య విష‌యం గుర్తుంచుకోవాలి. ఈ మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునే పన్ను చెల్లింపుదారులు.. గృహం స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్ల వ‌ర‌కు ఇంటిని విక్ర‌యించ‌కూడ‌దు. ఒక‌వేళ ఇంటిని అమ్మితే.. విక్ర‌యించిన సంవ‌త్స‌రం, అప్ప‌టి వ‌ర‌కు పొందిన మిన‌హాయింపును తిరిగి మీ ఆదాయానికి చేర్చి.. వ‌ర్తించే స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. 

గృహ రుణ వ‌డ్డీపై: ఆదాయపు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 24 (బి) ప్ర‌కారం.. ప‌న్ను చెల్లింపుదారుడు స్వీయ ఆక్రమిత గృహ రుణంపై చెల్లించే వ‌డ్డీపై రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. స్వీయ ఆక్ర‌మిత ఇల్లు కాకుండా ఇత‌ర ఇంటి ఆస్తి కోసం తీసుకున్న రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. ఒక‌వేళ మీరు నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే.. కొనుగోలు చేసిన వెంట‌నే రుణ ఈఎంఐ చెల్లింపులు ప్రారంభ‌మైన‌ప్ప‌టీకీ.. వ‌డ్డీ క్లెయిమ్ చేసుకోలేరు. ఆస్తి నిర్మాణం పూర్తిచేసి స్వాధీనం చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే ఈ సెక్ష‌న్ కింద గృహ రుణంపై వ‌డ్డీ క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 

అలాగే, నిర్మాణంలో ఉన్న‌ప్పుడు.. చెల్లించిన వ‌డ్డీని కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అది కూడా నిర్మాణం పూర్తయిన త‌ర్వాత మాత్ర‌మే. ఎలాగంటే.. ఇల్లు నిర్మాణంలో ఉన్న‌ప్పుడు చెల్లించిన వ‌డ్డీ మొత్తాన్ని ఐదు స‌మ‌ భాగాలుగా చేసి, ఇల్లు స్వాధీనం చేసుకున్న ఏడాది నుంచి 5 సంవ‌త్స‌రాలు, ఆయా సంత్స‌రాల‌కు చెల్లించిన వ‌డ్డీతో పాటు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే గ‌రిష్ఠ మిన‌హాయింపు ప‌రిమితి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం 2019 నుంచి నెల‌కు రూ.10 వేల చొప్పున గృహ రుణ వ‌డ్డీ చెల్లిస్తున్నారునుకుందాం. 2021లో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు మీరు సుమారుగా రూ.2.40 ల‌క్ష‌లు వ‌డ్డీ చెల్లించారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఐదు స‌మాన భాగాలుగా చేస్తే.. రూ. 48 వేలు వ‌స్తుంది. ఇల్లు పూర్తయిన త‌ర్వాత నుంచి ఏడాది రూ.1.20 ల‌క్ష‌లు వ‌డ్డీ చెల్లిస్తున్నారనుకుంటే ఈ మొత్తానికి రూ.48 వేలు చేర్చి రూ.1.68 ల‌క్ష‌లు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ రెండు క‌లిపి సెక్ష‌న్ 24(బి) కింద అనుమ‌తించిన గ‌రిష్ఠ ప‌రిమితి రూ. 2 లక్ష‌లు మించ‌కుండా చూసుకోవాలి.

సెక్ష‌న్ 80ఈఈఏ మిన‌హాయింపు: ఒక‌వేళ మీరు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో గృహ రుణం తీసుకొని ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేస్తుంటే.. సెక్ష‌న్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్ష‌ల అద‌న‌పు త‌గ్గింపును పొందొచ్చు. స‌ర‌స‌మైన గృహనిర్మాణ విభాగంలో కొనుగోలుదారుల‌కు సాయపడడానికి ఈ త‌గ్గింపును కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ 2019లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇది ష‌ర‌తుల‌కు లోబ‌డి ఉంటుంది. 

ఈ అద‌న‌పు మిన‌హాయింపును పొంద‌డానికి గృహ రుణాన్ని 2019 ఏప్రిల్ 1 - 2020 మార్చి 31 మ‌ధ్య మంజూరు చూసి ఉండాలి. ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 ల‌క్ష‌ల లోపు ఉండాలి. మొద‌టిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారికే ఇది వ‌ర్తిస్తుంది. రుణం తీసుకున్న తేదీ నాటికి మ‌రో ఇంటి క‌లిగి ఉండ‌కూడ‌దు. ఈ మిన‌హాయింపు సెక్ష‌న్ 24 (బి) కింద ల‌భించే రూ. 2 ల‌క్ష‌లకు అద‌నంగా ల‌భిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు గృహ రుణంపై సంవత్స‌రానికి రూ.3.5 లక్ష‌లు వ‌డ్డీ చెల్లిస్తుంటే.. సెక్ష‌న్ 24 (బి) కింద రూ.2 ల‌క్ష‌లు, సెక్ష‌న్ 80ఈఈఏ కింద రూ.1.5 ల‌క్ష‌లు మొత్తంగా రూ.3.5 ల‌క్ష‌ల వ‌డ్డీపై మిన‌హాయింపు పొందొచ్చు.

ఉమ్మ‌డిగా గృహ రుణం తీసుకుంటే: మీరు ఒక‌వేళ ఉమ్మ‌డిగా గృహ రుణం తీసుకుని ఉంటే.. సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ. 1.5 ల‌క్ష‌లు, సెక్ష‌న్ 24 (బి) ప్ర‌కారం రూ. 2 ల‌క్ష‌లు ఇద్ద‌రు విడివిడిగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇల్లు, ఇంటి కోసం తీసుకున్న రుణం రెండూ ఇద్ద‌రి పేరు పైనా ఉండాలి. ఇంటిలో వారికి ఉన్న భాగం ఆధారంగా మిన‌హాయింపులు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ర‌వి, త‌న భార్య క‌లిసి 50:50 షేరుతో ఇల్లు కొనుగోలు చేశార‌నుకుందాం. వారు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఇంటి రుణం అస‌లు రూ.1,34,000 వడ్డీ కోసం రూ. 4,50,000 చెల్లిస్తున్నార‌నుకుందాం. ఇద్ద‌రికి ఆస్తిలో స‌మాన భాగం ఉంది కాబ‌ట్టి వ‌డ్డీ మొత్తంలో ర‌వి రూ.2 ల‌క్ష‌లు, అత‌డి భార్య రూ.2 ల‌క్ష‌లు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అందువ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి రుణం తీసుకోవ‌డం వ‌ల్ల కొంత అద‌న‌పు ప్ర‌యోజ‌నం పొందొచ్చు.

రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు: సెక్ష‌న్ 80సి కింద స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఈ సెక్ష‌న్ కింద‌కి వ‌చ్చే రూ.1.50 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా ఖ‌ర్చు చేసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో మాత్ర‌మే ఇవి క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని