Indegene IPO: ఐపీఓకి ఇండిజీన్‌ సన్నాహాలు.. సెబీకి దరఖాస్తు

బయోఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ డివైజెస్‌ కంపెనీలు ఉత్పత్తులను అభివృద్ధి చేసి విక్రయించడంలో ఇండిజీన్‌ అనే హెల్త్‌కేర్‌ టెక్‌ సంస్థ సాయపడుతుంటుంది. ఇది త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

Published : 15 Dec 2022 18:56 IST

దిల్లీ: ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించిన ప్రముఖ హెల్త్‌కేర్‌ టెక్‌ సంస్థ ఇండిజీన్‌ లిమిటెడ్‌ (Indegene Ltd) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO)కు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ (SEBI) అనుమతి కోరుతూ గురువారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.3,200 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్ల సెబీకి తెలిపింది.

ఐపీఓ (IPO) పరిమాణంలో రూ.950 కోట్లు విలువ చేసే తాజాగా షేర్లు ఉండనున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 3.63 కోట్ల ఈక్విటీ షేర్లను సైతం ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)’ కింద విక్రయానికి ఉంచనున్నారు. వ్యక్తిగత షేర్‌హోల్డర్ల హోదాలో ఉన్న మనీష్‌ గుప్తా, రాజేశ్‌ భాస్కరన్ , అనితా కలిసి 27 లక్షల షేర్లను విక్రయించనున్నారు. అలాగే కార్లిలే, బ్రైటన్‌ పార్క్‌ క్యాపిటల్‌, నడతుర్‌ ఫ్యామిలీ మరో 3.36 కోట్ల షేర్లను అమ్మనుంది.

ఈ ఐపీఓ (IPO)లో సమీకరించిన నిధుల్ని రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే మరికొన్ని నిధుల్ని మూలధన అవసరాలకు వాడుకోనున్నారు. అలాగే గతంలో కొనుగోలు చేసిన కొన్ని సంస్థలకు బకాయిలను చెల్లించనున్నారు. ఇతర కార్పొరేట్‌ అవసరాలకు కూడా కొన్ని నిధులను ఉపయోగించుకోనున్నట్లు ముసాయిదా పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ కింద రూ.190 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఐపీఓ (IPO) పరిమాణం ఆ మేర తగ్గుతుంది. 2021లో కార్లిలే గ్రూప్‌, బ్రైటన్‌ పార్క్‌ క్యాపిటల్‌ నుంచి ఈ కంపెనీ 200 మిలియన్‌ డాలర్లు సమీకరించింది.

ఇండిజీన్‌ (Indegene Ltd)ను 1998లో స్థాపించారు. బయోఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ డివైజెస్‌ కంపెనీలు ఉత్పత్తులను అభివృద్ధి చేసి విక్రయించడంలో ఇండిజీన్‌ సాయపడుతుంటుంది. 2021- 22లో ఈ కంపెనీ రూ. 1,665 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. 2019- 20 నుంచి 2021- 22 మధ్య 61 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అలాగే 2021- 22లో 81 శాతం వృద్ధితో రూ. 163 కోట్ల PAT ఆదాయాన్ని నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని