Gold: బంగారం ధరలకు రెక్కలు.. దేశంలో తగ్గిన వినియోగం

Gold consumption: దేశంలో బంగారం వినియోగం తగ్గుముఖం పట్టింది. గతేడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది.

Published : 31 Jan 2023 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహాది శుభకార్యాలు, పండగలకు బంగారం (Gold) కొనుగోలు చేసే అలవాటున్న మన దేశంలో గతేడాది పసిడి వినియోగం తగ్గుముఖం పట్టింది. క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో 3 శాతం మేర వినియోగం తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) వెల్లడించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణంగా పేర్కొంది. దేశీయంగా బంగారం వినియోగం తగ్గుముఖం పట్టడం వల్ల వాణిజ్య లోటు తగ్గించడానికి, రూపాయి విలువ పతనం అడ్డుకోవడానికీ ఓ విధంగా దోహదం చేసింది.

2022లో పసిడి వినియోగం 774 టన్నులకు తగ్గినట్లు WGC వెల్లడించింది. ఒక్క డిసెంబర్‌ త్రైమాసికంలోనే 20 శాతం తగ్గి 276.1 టన్నుల బంగారం వినియోగం జరిగిందని తెలిపింది. అయితే, 2023 మార్చి త్రైమాసికంలో వినియోగం పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికందడం, పెళ్లిళ్ల సీజన్‌ ఉండడం వంటివి ఇందుకు కారణమని కౌన్సిల్‌ తెలిపింది. బంగారానికి భారత్‌లో మూడింట రెండొంతుల డిమాండ్‌ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుందని పేర్కొంది. అలాగే, బంగారం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించారని డబ్ల్యూజీసీ తెలిపింది. మరికొందరు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించి కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేశారని తెలిపింది. ఈ విధంగా 2022లో మొత్తం 97.6 టన్నుల బంగారం రీసైక్లింగ్‌ అయ్యిందని కౌన్సిల్‌ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.57వేల పైనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని