India-Australia FTA: డిసెంబరు 29 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం!

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం డిసెంబరు 29 నుంచి అమల్లోకి రానుంది. 

Published : 30 Nov 2022 20:11 IST

దిల్లీ: ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబరు 29 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెండింతలై 45-50 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు దేశీయంగా చేపట్టాల్సిన ప్రక్రియ పూర్తయిందని భారత ప్రభుత్వం తమకు తెలియజేసినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 2న సంతకాలు చేసిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ECTA) ఇటీవలే ఆస్ట్రేలియా పార్లమెంటులో ఆమోదం పొందింది. తాజాగా ఒప్పందం అమలుకు కావాల్సిన ప్రక్రియను భారత్‌ కూడా పూర్తిచేసింది. దీంతో పలు రకాల ఉత్పత్తులు, ముడి పదార్థాలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఇరు దేశాల విపణుల మధ్య ఎగుమతులు-దిగుమతులు ఊపందుకొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్య బంధం విలువ దాదాపు 2,750 కోట్ల డాలర్లుగా ఉంది. ఈసీటీఏ అమలులోకి వచ్చిన అయిదేళ్లలో అది 5,000 కోట్ల డాలర్ల దాకా చేరుకోగలదని అంచనా.

ఆస్ట్రేలియా నుంచి ఇండియా దిగుమతుల విలువలో దాదాపు 70శాతం వాటా బొగ్గుదే. భారత ఉక్కు రంగంలో కీలకంగా ఉన్న బొగ్గుపై ప్రస్తుతం 2.5శాతం పన్ను విధిస్తున్నారు. ఈసీటీఏ పట్టాలకెక్కితే అది పన్నురహిత జాబితాలోకి వెళ్తుంది. ఈసీటీఏ అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచే 96.4శాతం భారతీయ ఉత్పత్తులకు కాన్‌బెర్రా విపణిలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. ఆ జాబితాలోని అనేక సరకులకు ప్రస్తుతం అక్కడ 4-5శాతం పన్ను విధిస్తున్నారు. మానవ వనరుల వినియోగం ఎక్కువగా ఉన్న తోళ్లు, ఆభరణాలు, ఫర్నిచర్‌, ఫార్మా, వ్యవసాయోత్పత్తులు, ఆటొమొబైల్‌, ఎలక్ట్రికల్స్‌, క్రీడాసామగ్రి తయారీ రంగాలు ఆస్ట్రేలియా విపణిలో పన్నుభారం తొలగిపోవడం లేదా తగ్గడం వల్ల లాభపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని