FTA: ‘జీసీసీ’తో స్వేచ్ఛా వాణిజ్యంపై త్వరలో భారత్‌ చర్చలు

జీసీసీతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునే దిశగా కీలక ముందడుగు పడబోతోంది. త్వరలోనే ఆయా దేశాలతో చర్చలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Published : 17 Nov 2022 13:22 IST

దిల్లీ: భారత్‌, ‘గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (GCC)’ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. నవంబరు 24 నుంచి చర్చలు మొదలు కావొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే జీసీసీ అధికారులు భారత్‌కు చేరుకున్నట్లు తెలిపారు. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కతార్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రైన్‌.. మొత్తం ఆరు సభ్యదేశాలు ఉన్నాయి. భారత్‌ ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి యూఏఈతో ఎఫ్‌టీఏను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. త్వరలోనే మరో ఎఫ్‌టీఏపై చర్చలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే జీసీసీతో 2006, 2008లో రెండు దఫాలు ఎఫ్‌టీఏపై చర్చలు జరిగాయి. కానీ, జీసీసీ తాత్కాలికంగా ఎఫ్‌టీఏలను నిలిపివేయాలని నిర్ణయించడంతో మళ్లీ చర్చలు జరగలేదు. గల్ఫ్‌ దేశాలైన సౌదీ, కతార్‌ నుంచి భారత్‌ ప్రధానంగా ముడి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాలకు ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, ఇమిటేషన్‌ నగలు, ఎలక్ట్రికల్‌ యంత్రాలు, ఇనుము, ఉక్కు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. 2020-21లో జీసీసీకి భారత ఎగుమతుల విలువ 27.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2021-22 నాటికి అది 25.26 శాతం పెరిగి 44 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్షం. ఇదే సమయంలో మొత్తం భారత ఎగుమతుల్లో జీసీసీ వాటా 10.4 శాతం పెరిగింది. మరోవైపు దిగుమతుల విలువ 85.8 శాతం పెరిగి 110.73 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశ మొత్తం దిగుమతుల్లో ఈ ఆరు దేశాల వాటా 18 శాతానికి చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యం 154.73 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

వాణిజ్యపరంగానే కాకుండా గల్ఫ్‌ దేశాలతో భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. ఈ దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా గణనీయంగా ఉంటుంది. 32 మిలియన్ల ప్రవాస భారతీయుల్లో సగానికి పైగా గల్ఫ్‌ దేశాల్లోనే పనిచేస్తున్నారు. వీరు పంపే డబ్బు మన విదేశీ మారక నిల్వలకు ప్రధాన వనరు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయులు పంపిన డబ్బు విలువ 2021లో 87 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంట్లో జీసీసీ దేశాలది కీలక వాటా అని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి సౌదీ అరేబియా నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. యూఏఈ మూడు, కువైట్‌ 27వ స్థానంలో ఉన్నాయి. కతార్‌ నుంచి భారత్‌ ఏటా 8.5 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంటోంది. చిరుధాన్యాలు, చేపలు, రసాయనాలు, ప్లాస్టిక్స్‌ ఎగుమతి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని