IMF: ఆర్థిక నిర్వహణలో భారత్‌ భేష్‌.. కానీ,

దేశ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించడంలో భారత్‌ ఉత్తమంగా పనిచేస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కితాబిచ్చింది....

Published : 11 Mar 2022 14:23 IST

వాషింగ్టన్‌: దేశ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించడంలో భారత్‌ ఉత్తమంగా పనిచేస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కితాబిచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా తాజాగా పెరిగిన ఇంధన ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా జార్జియేవా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల ప్రభావంపై చర్చ సందర్భంగా గురువారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

భారత్‌తో పాటు ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సవాల్‌ విసురుతోందని ఐఎంఎఫ్‌ ఫస్ట్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ఇంధన అవసరాలకు అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ద్రవ్యోల్బణం ఆరు శాతంగా ఉందని గుర్తుచేశారు. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి చేరుకుందన్నారు. దీనివల్ల దేశ ద్రవ్య విధానంపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 

ఇంధన ధరల పెరుగుదల వల్ల అత్యంత ప్రభావితమయ్యే వర్గాలపై ప్రభుత్వాలు తొలుత దృష్టిసారించాలని జార్జియేవా ఐఎంఎఫ్‌ సభ్యదేశాలకు సూచించారు. క్రమంగా ఆహారపదార్థాల ధరలు కూడా పెరుగుతాయని.. వాటి నుంచి బడుగు వర్గాలను రక్షించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అందుకనుగుణంగానే ద్రవ్య విధానాలు ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని