India economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ప్రభుత్వ చేపడుతున్న చర్యలు, విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీలు భారత్‌కు తరలిరావడం వంటి సానుకూల అంశాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి మూడో అతిపెద్దదిగా అతవరిస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది.

Updated : 02 Dec 2022 19:45 IST

దిల్లీ: బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌.. 2030 నాటికి జపాన్‌, జర్మనీనీ దాటేసి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. అప్పటికల్లా భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు సగటున 6.3 శాతంగా నమోదవుతుందని తెలిపింది. 2031 నాటికి భారత జీడీపీ ప్రస్తుత స్థాయి నుంచి రెండింతలు వృద్ధి చెందుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. జపాన్‌, జర్మనీ ఆ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి.

భారత్‌కు విదేశీ కంపెనీలు తరలిరావడం, తయారీ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ, నూతన ఇంధన వనరుల దిశగా మార్పు, అత్యాధునిక డిజిటల్‌ మౌలిక వసతులు భారత వృద్ధికి ఊతమిస్తాయని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. వీటితో పాటు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు సైతం దోహదం చేస్తాయని పేర్కొంది. ఆర్థిక సరళీకరణలు, కార్మిక చట్టాల్లో సవరణలు, మౌలిక వసతుల్లో మూలధన వ్యయం సైతం భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయని తెలిపింది. 

భారత్‌ను ఎగుమతుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే భారత్‌ తయారీ హబ్‌గానూ అవతరిస్తుందని తెలిపారు. అందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI) వంటి చర్యలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. భారత జీడీపీలో తయారీ రంగ వాటా 2031 నాటికి 21 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఈ రంగ ఆదాయం 447 బిలియన్‌ డాలర్ల నుంచి 1,490 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపారు. 

అయితే ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసిరే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం అందులో ప్రధానమైందని పేర్కొంది. ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా వృద్ధి చెందుతుండడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటంకంగా మారొచ్చని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు