Forex Revenue: ఒక్క ఐటీ రంగం నుంచే 43% ఫారెక్స్‌ ఆదాయం!

Forex Revenue: భారత్‌ పేరు చెప్పగానే ప్రపంచ దేశాలకు గుర్తొచ్చేది ఐటీ. విదేశీ మారక ఆదాయం కోసం కార్పొరేట్‌ ఇండియా ఈ రంగంపై గతంలో కంటే ఎక్కువగా ఆధారపడుతోంది.

Updated : 22 Jul 2022 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ పేరు చెప్పగానే ప్రపంచ దేశాలకు గుర్తొచ్చేది ఐటీ. విదేశీ మారక ఆదాయం కోసం కార్పొరేట్‌ ఇండియా ఈ రంగంపై గతంలో కంటే ఎక్కువగా ఆధారపడుతోంది. నమోదిత సంస్థల ఫారెక్స్‌ ఆదాయంలో ఐటీ కంపెనీలే దాదాపు 43 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది దశాబ్ద క్రితంతో పోలిస్తే 22 శాతం అధికం.

నమోదిత ఐటీ సేవల కంపెనీలు 2021-22లో ఎగుమతుల ద్వారా దాదాపు రూ.4.2 లక్ష కోట్లు ఆర్జించాయి. క్రితం ఏడాది నమోదైన రూ.3.65 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన బీఎస్‌ఈ500 కంపెనీల ఫారెక్స్ రాబడులు లేదా ఎగుమతులు 11.9 శాతం తగ్గి రూ.5.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో, ఐటీ కంపెనీల ఫారెక్స్ రాబడులు 2016-17లో రూ.2.48 లక్షల కోట్ల నుంచి 11.3 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. ఇదే కాలంలో ఐటీయేతర సంస్థల ఫారెక్స్ రాబడులు వార్షికంగా 3.5 శాతం చొప్పున ఎగబాకాయి.

నిరంతర వాణిజ్య కొనసాగింపు, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి దేశానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు గనక మందగిస్తే దేశ ఫారెక్స్‌ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే దీంట్లో ఫారెక్స్‌ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ. మరోవైపు కార్పోరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్‌ ఆదాయాలను మించిపోయాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల ఫారెక్స్ లోటు రూ.3.96 లక్షల కోట్లుగా నమోదైంది. అదే మెటల్, మైనింగ్ కంపెనీలకు దాదాపు రూ.20,000 కోట్ల వరకు లోటు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని