Pharma: ప్రపంచ ఔషధరంగంలో అగ్రగామి కావాలంటే..!?

గురువారం ఆర్బీఐ ప్రకటించిన బులెటిన్‌లో ఫార్మారంగ నిపుణులైన షిబాంజన్‌ దత్తా, ధీరేంద్ర గజ్‌భియే దేశీయ ఫార్మా రంగానికి సంబంధించి పలు..

Updated : 13 May 2022 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఔషధ రంగం కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ‘ఒత్తిడి పరీక్ష’కు గురైందని, అలాగే ఇది ముడి సరకుల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడటాన్ని బహిర్గతం చేసిందని ఆర్బీఐ బులెటిన్‌ వెల్లడించింది. గురువారం ఆర్బీఐ ప్రకటించిన బులెటిన్‌లో ఫార్మారంగ నిపుణులైన షిబాంజన్‌ దత్తా, ధీరేంద్ర గజ్‌భియే దేశీయ ఫార్మా రంగానికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. చాలా ఆశ్చర్యకరంగా ముడి సరకుల గురించి దేశంలో అతి తక్కువ పరిశోధన, అభివృద్ధి జరిగిందని ఈ బులెటిన్‌ తెలిపింది. అధికంగా దిగుమతులపై ఆధారపడటం, తగినంతగా పరిశోధనలు చేయకపోవడంతో ఔషధాల ఎగుమతులపై భారీగా ప్రభావం పడుతోందని విమర్శించింది. అందువల్ల ఇప్పటికైనా ముడి సరకులను ఒకే దేశం నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోక, వేర్వేరే మూలాలను అన్వేషించాలని పేర్కొంది.  తద్వారా సరఫరా గొలుసులో ఉన్నఅడ్డంకులను అధిగమించాలని హితవు పలికింది.

ప్రస్తుతం భారత్‌ స్థానం!

ప్రపంచంలోనే ఔషధోత్పత్తిలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ ఉందనీ, ఉత్పత్తయిన ఔషధాల విలువ ఆధారంగా 14వ స్థానాన్ని పొందిందని ఆ బులెటిన్‌ తెలియజేసింది. అలాగే దేశ జీడీపీకి 2 శాతం వాటాను అందిస్తూ, మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 8 శాతాన్ని ఈ రంగం ఆక్రమించుకుందని స్పష్టం చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ శతాబ్దంలోనే అత్యంత ఒత్తిడి పరీక్షకు ఎదురొడ్డి నిలిచిన దేశీయ ఫార్మారంగం, ఎగుమతుల్లో కేవలం 21 శాతం వృద్ధిని మాత్రమే సాధించిందని పేర్కొంది.  తన సొంత సరఫరా గొలుసును సమకూర్చుకుని, గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌లో భారతదేశం ఒక ఆధారపడదగిన ఎగుమతిదారుగా ఈ  సంక్షోభ సమయంలో తన స్థాయిని పెంచుకోవాలని సూచించింది. 

ముడి సరకులనూ సమకూర్చుకోవాలి! 

గడచిన రెండు దశాబ్దాల్లో తుది ఉత్పత్తులను అందించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, ముడి పదార్థాల తయారీని బాగా నిర్లక్ష్యం చేసిందనే ప్రధానమైన లోపాన్ని ఆర్బీఐ బులెటిన్‌ ఎత్తి చూపింది. దాంతో పొరుగునే ఉన్న చైనాపై మనదేశం బాగా ఆధారపడుతోందని, దాదాపు 85 శాతం దిగుమతులు ఆ దేశం నుంచే వస్తున్నాయని తెలిపింది. చైనా నుంచి దిగుమతులు పెరగడానికి ఆ దేశం పెద్ద ఎత్తున ఇన్‌గ్రేడియంట్లను ఉత్పత్తి చేస్తుండటం, అలాగే మన ప్రభుత్వం ఉదారంగా వాటికి అనుమతులు మంజూరు చేయడమే కారణమని చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా పరిశోధనలకు తగినంత కేటాయింపులు చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని