FDI: మోదీ పాలనలో 65శాతం పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఆర్థికమంత్రి

యూపీఏ పదేళ్ల పాలనతో పోలిస్తే నరేంద్ర మోదీ హయాంలోనే దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Updated : 29 Mar 2022 18:54 IST

దిల్లీ: యూపీఏ పదేళ్ల పాలనతో పోలిస్తే నరేంద్ర మోదీ హయాంలోనే దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మోదీ పాలనలో 500 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. యూపీఏ ప్రభుత్వ పదేళ్లపాలనతో పోలిస్తే ఇవి 65శాతం ఎక్కువన్నారు. ఇక కరోనా మాదిరిగానే ఉక్రెయిన్‌ సంక్షోభం కూడా అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందన్న ఆమె.. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం వల్లే ఈ సమస్య వస్తోందన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం పన్నుల భారాన్ని తమ ప్రభుత్వం మోపలేదని గుర్తుచేశారు.

‘ఆర్థికవ్యవస్థ పునరుద్ధర కోసం ఎటువంటి పన్నులు పెంచలేదు. అంతేకాకుండా వనరుల సమీకరణకు పన్నులను మార్గంగా ఎంచుకోలేదు. అయినప్పటికీ కేంద్ర పన్నుల నుంచి రూ.8.35లక్షల కోట్లను రాష్ట్రాలకు కేటాయించాం. ఈ ఆర్థిక సంవత్సరం అంచనా వేసిన రూ.7.45లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థికంగా కోలుకోవడంలో భాగంగా నిధులు సమకూర్చుకునేందుకు 32పైగా దేశాలు పన్నులను పెంచాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)ను ఆకర్షిస్తోన్న తొలిఐదు దేశాల్లో భారత్‌ కొనసాగుతోందన్నారు.

ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎఫ్‌డీఐల ప్రవాహం 500.5బిలియన్‌ డాలర్లకు చేరిందన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లతో పోలిస్తే ఇది 65శాతం ఎక్కువ అని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వ పాలనపై ఉన్న విశ్వాసంతోనే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. క్రితం (2019-20) ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 74.9బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే.. 2020-21లో ఇవి 81.71 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్‌  వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని