Chinese mobiles: చైనాకు భారత్‌ మరో షాక్‌.. ఆ మొబైళ్లపై నిషేధం...?

Chinese mobiles: చైనాకు చెందిన యాప్స్‌పై ఉక్కుపాదం మోపిన కేంద్రం.. మరో ఝలక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Published : 08 Aug 2022 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన యాప్స్‌పై ఉక్కుపాదం మోపిన కేంద్రం.. మరో ఝలక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల (Chinese mobiles) దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ₹12వేల రూపాయల్లోపు ధరలో మొబైళ్లను విక్రయించకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం (Modi govt) యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా మొబైల్‌ తయారీ కంపెనీల ప్రవేశంతో కుంగిపోయిన దేశీయ మొబైల్‌ కంపెనీలకు ఊతమిచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకునే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ తన కథనంలో పేర్కొంది.

దేశంలో ఒకప్పుడు దేశీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలదే హవా. లావా, మైక్రోమ్యాక్స్‌ కంపెనీల ఫోన్లే ఎక్కువగా కనిపించేవి. చైనా కంపెనీల ప్రవేశంతో దాదాపు ఇవి కనుమరుగయ్యాయి. ప్రధానంగా షావోమి, రియల్‌మీ, ఒప్పో, వివో కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై గట్టి పట్టు సాధించాయి. బడ్జెట్‌ ఫోన్‌ విక్రయాల్లో వీటిదే హవా. రూ.12వేల లోపు ధరలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో చైనా కంపెనీల వాటానే 80 శాతం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనా కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు రూ.12వేల ధరలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలపై నిషేధం విధించేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే షావోమి, రియల్‌మీ వంటి కంపెనీలకు గట్టిదెబ్బే. అదే సమయంలో దేశీయ కంపెనీలకు పునరుజ్జీవం పోసినట్లు అవుతుంది. ఈ నిర్ణయం వల్ల యాపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీల ఫోన్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ కంపెనీలు విక్రయించే ఫోన్లన్నీ దాదాపు ₹12వేల పైనే ఉండడం దీనికి కారణం. ఇప్పటికే ఆర్థిక అవకతవకల ఆరోపణలపై షావోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో సుమారు 300 చైనా యాప్స్‌పై భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రతను కారణంగా చూపుతూ ఆ దేశానికి చెందిన జడ్‌టీఈ, హువావే కంపెనీల టెలికాం పరికరాలపైనా భారత్‌ ఆంక్షలు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని