Indian Economy: ఇది 2013కు ముందున్న భారత్‌ కాదు: మోర్గాన్‌ స్టాన్లీ

Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై మోర్గాన్‌ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది. మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.

Updated : 31 May 2023 17:23 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) నేతృత్వంలో భారత్‌ చాలా రూపాంతరం చెందిందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) అభిప్రాయపడింది. ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని కొనియాడింది. ఆసియా సహా ప్రపంచ వృద్ధి పథంలో భారత్‌ కీలకంగా మారిందని తెలిపింది.

భారత వృద్ధి (India's Growth)పై సంశయాన్ని వ్యక్తం చేస్తున్నవారు 2014 తర్వాత వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవడం లేదని మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) అభిప్రాయపడింది. భారత్‌ ఇంకా తన పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలను అందుకోలేకపోతోందని.. ఇక్కడి ఈక్విటీ మార్కెట్లు అధిక ధరల వద్ద చలిస్తున్నాయనే విమర్శలు వస్తున్నట్లు ప్రస్తావించింది. గత తొమ్మిదేళ్లుగా వ్యవస్థాగతంగా వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని స్పష్టం చేసింది.

‘‘ప్రస్తుతం ఉన్న భారత్‌ 2013లో ఉన్నదానితో పోలిస్తే చాలా భిన్నమైనది. 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో గణనీయమైన సానుకూల పరిణామాలతో ప్రపంచ వేదికపై భారత్‌ కీలక స్థానానికి చేరుకుంది. ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలోనే ఈ రూపాంతరం సాధ్యమైంది’’ అని మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) తన నివేదికలో పేర్కొంది. కార్పొరేట్‌ పన్ను (Corporate Tax)ను తగ్గించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం కీలక సంస్కరణలని తెలిపింది. జీఎస్‌టీ వసూళ్లు పుంజుకోవడం, జీడీపీలో డిజిటల్‌ లావాదేవీల శాతం గణనీయంగా పెరగడం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణకు దోహదం చేసినట్లు పేర్కొంది.

లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, దివాలా స్మృతి చట్టం, అనువైన ద్రవ్యోల్బణ లక్ష్యం, ఎఫ్‌డీఐ (FDI)లపై దృష్టి, కార్పొరేట్‌ లాభాలకు ప్రభుత్వ మద్దతు, స్థిరాస్తి రంగానికి కొత్త చట్టం, బహుళజాతి సంస్థల సెంటిమెంటు పెరగడం భారత్‌లో వచ్చిన మరికొన్ని కీలక మార్పులని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. జీడీపీలో తయారీ, మూలధన వ్యయాల శాతం క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు పేర్కొంది. ఎగుమతుల మార్కెట్‌ వాటా 2031 నాటికి రెండింతలై 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది. ఈ కారణాల వల్లే కార్పొరేట్‌ సహా స్టాక్‌ మార్కెట్‌ మదుపర్ల లాభాలు పెరిగాయని చెప్పింది. అలాగే ప్రపంచ చమురు ధరల ప్రభావం కూడా స్టాక్‌ మార్కెట్లపై తగ్గిందని పేర్కొంది.

భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్ల నుంచి 2032 నాటికి 5,200 డాలర్లకు పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఇది దేశీయ వినిమయంపై సానుకూల పరిణామాలు ఉంటాయని పేర్కొంది. కాస్త ఆలోచించి చేసే కొనుగోళ్లు సైతం పెరుగుతాయని తెలిపింది. అలాగే ‘ప్రస్తుత ఖాతా లోటు (CAD)’ క్రమంగా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.

జీడీపీలో కార్పొరేట్‌ లాభాల శాతం పెరుగుతోందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. మరి కొన్నేళ్లలో అవి రెండింతలయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. భారత ఈక్విటీలు గరిష్ఠాలకు చేరడానికి ఇదే కారణమని తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, కమొడిటీ ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసిరే అంశాలుగా ప్రస్తుతానికి కనిపిస్తున్నాయని వివరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు