Unemployment: భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందోచ్‌!

భారత్‌లో నిరుద్యోగం 6.43 శాతానికి తగ్గినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ ( సీఎంఐఈ) వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందనాడానికి ఇదే నిదర్శనమని సీఎంఐఈ ఎండీ  మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు.

Updated : 01 Oct 2022 22:34 IST

ముంబయి: భారత్‌లో నిరుద్యోగం 6.43 శాతానికి తగ్గినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ ( సీఎంఐఈ) వెల్లడించింది. ఏడాది కాలంలో అత్యధికంగా 8.3% నిరుద్యోగం ఆగస్టులో నమోదైంది. తాజాగా సెప్టెంబరు నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 20 లక్షలు తగ్గి 39 కోట్ల 46 లక్షలకు చేరిందని సీఎంఐఈ తన నివేదికలో పేర్కొంది. ‘‘ సెప్టెంబరు నెలలో నిరుద్యోగం అనూహ్యంగా తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఉద్యోగుల సంఖ్య పెరిగింది’’ అని సీఎంఐఈ ఎండీ మహేశ్‌ వ్యాస్‌ ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు.

సెప్టెంబరు నెలలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.68 % నుంచి 5.84 శాతానికి తగ్గినట్లు మహేశ్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 9.57 శాతంగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 7.70 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. సీఎంఐఈ నివేదిక ప్రకారం రాజస్థాన్‌లో అత్యధికంగా 23.8శాతం నిరుద్యోగులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జమ్ము కశ్మీర్‌ (23.2%),హరియాణా (22.9 %), త్రిపుర (17%), ఝార్ఖండ్‌ (12.2 %), బిహార్‌ (11.4%) ఉన్నాయి. అత్యల్పంగా నిరుద్యోగం ఛత్తీస్‌గఢ్‌ (0.1%)లో నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం (0.4%) ఉత్తరాఖండ్‌ (0.5%) మధ్యప్రదేశ్‌ (0.9%),గుజరాత్‌ (1.6 %),మేఘాలయ (2.3%),ఒడిశా (2.9%) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని