SBI chairman: మాంద్యం ప్రభావం భారత్‌పై అంతగా ఉండదు: ఎస్‌బీఐ ఛైర్మన్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ప్రభావం ఎదుర్కొన్నా.. దాని ప్రభావం భారత్‌పై మాత్రం అంతగా ఉండదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు.

Published : 15 Oct 2022 10:48 IST

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు సైతం దీని గురించి హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ప్రభావం ఎదుర్కొన్నా.. దాని ప్రభావం భారత్‌పై మాత్రం అంతగా ఉండదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. దేశంలో వృద్ధికి ఢోకా లేదని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పారు. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌ సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్‌ వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాంద్యం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌పై మాంద్యం ప్రభావం అంతగా ఉండబోదని దినేశ్‌ ఖారా అన్నారు. బీటా ఫ్యాక్టర్‌నే (స్టాక్‌ హెచ్చుతగ్గులు కొలిచే విలువ) పరిగణనలోకి తీసుకుంటే ఎగుమతులు ప్రధానంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌ బీటా ఫ్యాక్టర్‌ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థికంతో పోలిస్తే భారత్‌ వృద్ధి రేటు అంచనాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చని చెప్పారు. ప్రపంచ దేశాలను ద్రవ్యోల్బణం వణికిస్తున్నప్పటికీ దేశీయంగా అదుపులోనే ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ కారణం కాదని దినేశ్‌ ఖారా తెలిపారు. సప్లయ్‌ ఆధారిత ద్రవ్యోల్బణం అని పేర్కొన్నారు. సరఫరా గొలుసులో అంతరాలే ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ సామర్థ్య వినియోగం 71 శాతం మాత్రమే ఉందని చెప్పారు. దీన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణానికి క్రూడాయిల్‌ ధరలూ మరో కారణమని చెప్పారు. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ రానున్న రోజుల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. భారత వృద్ధి అవకాశాలు మున్ముందు మరింత మెరుగుపడతాయని ధీమా వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని