Mukesh Ambani: 20 ఏళ్లలో హరిత కేంద్రంగా భారత్‌: ముకేశ్‌ అంబానీ

వచ్చే 20 ఏళ్లలో భారత్‌ హరిత ఇంధన కేంద్రంగా మారనుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అంచనా వేశారు....

Published : 23 Feb 2022 21:29 IST

దిల్లీ: వచ్చే 20 ఏళ్లలో భారత్‌ హరిత ఇంధన కేంద్రంగా మారనుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. అప్పటికల్లా 500 బిలియన్ డాలర్లు విలువ చేసే స్వచ్ఛ ఇంధన ఎగుమతుల్ని సాధిస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే రిలయన్స్‌, అదానీ సహా మరికొన్ని కంపెనీలు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా బ్యాటరీ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు, ఫ్యుయల్‌ సెల్స్ ఉత్పత్తికి ప్రణాళికలు సైతం ప్రకటించాయి. ఒక డాలర్ కంటే తక్కువ ధరకు కిలో హైడ్రోజన్ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ గతంలో ప్రకటించింది.

గత 20 ఏళ్లలో భారత్‌ ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించిందని అంబానీ గుర్తుచేశారు. రాబోయే 20 ఏళ్లలో టెక్నాలజీతో పాటు ఇంధన, లైఫ్‌సైన్సెస్‌లో భారత్‌ సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని తెలిపారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉంది. ఇక విద్యుత్తు కోసం ప్రధానంగా బొగ్గుపై ఆధారపడుతోంది. భారత్‌ ఇంధన, విద్యుత్తు అవసరాలకు శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాల్సిన అవసరం ఉందని అంబానీ అన్నారు. వచ్చే రెండు, మూడు దశాబ్దాల్లో వీటికి పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు.

‘2070 నాటికి భారత్‌ను సున్నా ఉద్గారాల (నెట్‌ జీరో) స్థాయికి చేర్చుతాం. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకం పెంచుతాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ‘కాప్‌26’ సదస్సులో ప్రకటించిన విషయం తెలిసిందే. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 105 గిగావాట్ల సామర్థ్యం ఉంది. అలాగే 2030 నాటికి 5 మిలియన్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తికి ఇటీవల ప్రణాళికలు సైతం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని