ఇంధన కొరత రానివ్వం.. అందుకు చేయాల్సింది చేస్తాం: హర్దీప్‌ సింగ్‌ పురి

దేశ ఇంధన భద్రతకు, అందుబాటు ధరలో లభ్యత కోసం భారత్‌ చేయాల్సింది చేస్తుందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి చెప్పారు.

Published : 14 Oct 2022 22:16 IST

జయపుర: ఉత్పత్తిని తగ్గిస్తూ చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్‌) తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి స్పందించారు. దేశ ఇంధన భద్రతకు, అందుబాటు ధరలో లభ్యత కోసం భారత్‌ చేయాల్సింది చేస్తుందని చెప్పారు. అవసరమైతే చమురును కావాల్సిన చోట కొనుగులు చేస్తామని ఓ సదస్సులో చెప్పారు. చమురు ఉత్పత్తిలో కోత విధించడం అనేది వారి (ఒపెక్‌ దేశాలు) సార్వభౌమ హక్కు అని హర్దీప్‌ సింగ్‌ అన్నారు. అదే సమయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు కొరత రానివ్వబోమని చెప్పారు.

భారత్‌ తన చమురు అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతోందని పురి చెప్పారు. భారత్‌కు చమురు ఎగుమతి దేశాల్లో సౌదీ అరేబియా తొలి స్థానంలో ఉండగా.. ఇరాక్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. అవసరమనుకుంటే చమురు వనరులు బహుముఖంగా ఉండేలా చూసుకుంటామని, ఆ స్వేచ్ఛ భారత్‌కు ఉందని పేర్కొన్నారు. చమురు ధరలను స్థిరీకరించడంలో భాగంగా ఒపెక్‌+ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధించాలని అక్టోబర్‌ 5న నిర్ణయించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ నుంచి 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు ఈ నిర్ణయం గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు